పురుగుల అన్నం పెడుతుండ్రు.. స్కూల్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నినాదాలు

పురుగుల అన్నం పెడుతుండ్రు.. స్కూల్ బిల్డింగ్ ఎక్కి  విద్యార్థుల నినాదాలు

ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఆహారంలో పురుగులు పడినా.. పాచిపోయినా.. పాడైపోయినా.. అలాగే తినమంటుండడంతో ఆగ్రహించిన విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ ఎక్కి నిరసనకు దిగారు. పాడైపోయిన ఆహారం తినలేకపోతున్నామంటూ  నేరడిగొండ కస్తూర్బా పాఠశాల విద్యార్థులు బిల్డింగ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. అర్ధాకలితో ఉండలేం.. గేటు ఓపెన్ చేయండి.. ఇంటికి వెళ్లిపోతాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరాలు వస్తున్నా.. ప్రిన్సిపల్, సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. దీంతో సిబ్బంది స్పందించి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని చికిత్స కోసం తీసుకెళ్లారు.

గతంలో ఆహారం సరిగా పెట్టడం లేదని.. నాణ్యతలేని.. పాడైపోయిన ఆహారం పెడుతున్నారని ఆందోళనలు చేసినా.. అధికారులు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు.. కానీ రెండు మూడు రోజులకే మళ్లీ పరిస్థితి మామూలైపోతోందని..  టిఫిన్, భోజనం పాడైపోయినా తినమని చెబుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు, రాళ్లు వచ్చి అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.