న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచుదాం :రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్

న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచుదాం :రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్

 

  • పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి 
  • ఓదెలలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఓపెనింగ్

పెద్దపల్లి, వెలుగు: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి, పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.  ఓదెల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోర్టులో న్యాయవాదులు, జడ్జిల ప్రవర్తన  మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలో ప్రతి పౌరుడికి వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా, తప్పనిసరిగా న్యాయ సేవలు అందాలని తెలిపారు.

 పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని,  వాటి పరిష్కారానికి అందరూ సహకరించాలని సూచించారు.  ఓదెల మండలంలో కోర్టు ఏర్పడడం చారిత్రాత్మకమని, దీనితో ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. అంతకుముందు హైకోర్టు జడ్జిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా, సుల్తానాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. తిరుపతి రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు ఎన్. వి. శ్రావణ్ కుమార్, ఇ.వి. వేణుగోపాల్, జె . శ్రీనివాస్  పాల్గొన్నారు.  డీసీపీ కరుణాకర్, ఆర్టీవో గంగయ్య, తహసీల్దార్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.