2026 ఫిబ్రవరి నుంచి ఎన్‌హెచ్‌ 65 విస్తరణ పనులు

2026 ఫిబ్రవరి నుంచి ఎన్‌హెచ్‌ 65 విస్తరణ పనులు

నల్గొండ అర్బన్, వెలుగు : హైదరాబాద్ –  విజయవాడ ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి 8 లేన్ విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండడమే కాకుండా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న రహదారుల్లో ఒకటన్నారు. ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని  తెలిపారు. 

ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేశానని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ కు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. 

హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం

చివ్వెంల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం గ్యారంటీ కార్డుల పేరుతో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. 'కాంగ్రెస్ బాకీ కార్డు' కార్యక్రమాన్ని సూర్యాపేట నియోజకవర్గం, చివ్వేంల మండలం, ఉండ్రుగొండ గ్రామంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని హామీలిచ్చి చివరకు 420 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని అని ఆయన విమర్శించారు. బాకీ కార్డు చేతపట్టి , కాంగ్రెస్ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ఆయన ప్రజలను కోరారు.