రిలయన్స్ ఆగలే.. మార్కెట్ తగ్గేదేలే

రిలయన్స్ ఆగలే.. మార్కెట్ తగ్గేదేలే
  • 7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు..
  • 1,241 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌‌‌‌
  • రూ. 6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
  • మార్కెట్ మరింత పైకి!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు ర్యాలీ చేయడంతో సోమవారం బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు  2 శాతం మేర పెరిగాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌లు లాభాల్లో క్లోజయ్యాయి. నిఫ్టీ 385  పాయింట్లు (1.8 శాతం) ఎగసి 21,738 దగ్గర,  సెన్సెక్స్ 1,241 పాయింట్లు లాభపడి 71,942 దగ్గర సెటిలయ్యాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది.

ఆసియా మార్కెట్‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌గా ట్రేడవ్వడంతో  లాభాల్లో ఓపెన్ అయిన నిఫ్టీ, ఇంట్రాడేలో 21,750 లెవెల్‌‌‌‌ను టచ్ చేసింది. చివరికి ఈ లెవెల్ దగ్గరలోనే ముగిసింది. నిఫ్టీలో ఓఎన్‌‌‌‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌, కోల్ ఇండియా,  అదానీ పోర్ట్స్‌‌‌‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. సిప్లా, ఐటీసీ, ఎల్‌‌‌‌టీఐ మైండ్‌‌‌‌ట్రీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెక్టార్ల పరంగా చూస్తే, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌ ఇండెక్స్ 5 శాతం ర్యాలీ చేయగా, పవర్, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు 3 శాతం వరకు పెరిగాయి. 

బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌ 1.7 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌ ఒక శాతం లాభపడ్డాయి. ఎస్‌‌‌‌జేవీఎన్‌‌‌‌, కమ్మిన్స్ ఇండియా, గోద్రెజ్‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌, ఇండియన్ బ్యాంక్‌‌‌‌, ఇండియన్ హోటల్స్‌‌‌‌, ఇన్ఫిబీమ్ అవెన్యూ, ఐఆర్‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌ఫ్రా, ఎల్‌‌‌‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌, ఎన్‌‌‌‌బీసీసీ (ఇండియా), ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌పీసీ వంటి షేర్లు సోమవారం 52 వారాల గరిష్టాన్ని టచ్ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐ) సోమవారం  నికర కొనుగోలుదారులుగా మారారు.  నికరంగా రూ.110 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.  డొమెస్టిక్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా రూ.3,221 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 19 లక్షల కోట్లపైనే.. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం 7 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్‌‌‌‌ క్యాప్  రూ.19.5 లక్షల కోట్ల మార్క్‌‌‌‌ను టచ్ చేసింది. ఈ ఒక్క సెషన్‌‌‌‌లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు పెరిగింది. రిలయన్స్ షేర్లు  ఈ నెలలో ఇప్పటి వరకు 11 శాతం ఎగశాయి. రిలయన్స్  సోమవారం రూ.2,905 దగ్గర ఆల్‌‌‌‌ టైమ్‌‌‌‌ హై లెవెల్‌‌‌‌ను టచ్ చేసింది. చివరికి రూ. 2,896 దగ్గర సెటిలయ్యింది.  వాల్ట్‌‌‌‌ డిస్నీ ఇండియా బిజినెస్‌‌‌‌ను తక్కువ రేటుకే రిలయన్స్ కొనుగోలు చేస్తోందన్న వార్తలతో కంపెనీ షేర్లు దూసుకుపోయాయి.  వాల్ట్‌‌‌‌ డిస్నీ ఇండియా యూనిట్‌‌‌‌,  రిలయన్స్ మీడియా బిజినెస్‌‌‌‌ మెర్జ్ అవుతున్న విషయం తెలిసిందే.

చర్చల తర్వాత డిస్నీ ఇండియా వాల్యూ గతంలో అనుకున్న 10 బిలియన్ డాలర్ల నుంచి 4.5 బిలియన్ డాలర్లకు తగ్గిందని బ్లూమ్‌‌‌‌బర్గ్ రిపోర్ట్‌‌‌‌ చేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి 11 బిలియన్ డాలర్ల విలువైన మీడియా బిజినెస్‌‌‌‌ను క్రియేట్ చేయనున్నాయి. ఇందులో డిస్నీ ఇండియాకు 40 శాతం వాటా ఉంటుంది. దీనికి తోడు జీ–సోనీ డీల్ ఆగిపోవడంతో డిస్నీ – రిలయన్స్‌‌‌‌కు కాంపిటేటర్‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయారు.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

1.   మార్కెట్ ర్యాలీని ఎనర్జీ షేర్లు నడిపాయని, ముఖ్యంగా  ఓఎన్‌‌‌‌జీసీ, రిలయన్స్ షేర్లు దూసుకుపోవడంతో ఇండెక్స్‌‌‌‌లు పెరిగాయని ప్రోగ్రెసివ్‌‌‌‌ షేర్స్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదిత్య గగ్గర్ అన్నారు. నిఫ్టీ ఈ వారాన్ని కీలకమైన సపోర్ట్ లెవెల్‌‌‌‌ 21,500 దగ్గర స్టార్ట్ చేసిందని, సోమవారం సెషన్‌‌‌‌లో మరింత పెరిగిందని చెప్పారు.  ‘ఎఫ్‌‌‌‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌లు గ్రీన్‌‌‌‌లో క్లోజయ్యాయి.

ఎనర్జీ, పీఎస్‌‌‌‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్‌‌‌‌లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ 21,500, 21,700 లెవెల్స్‌‌‌‌ను ఈజీగా దాటింది. డైలీ చార్ట్‌‌‌‌లో అతిపెద్ద గ్రీన్ క్యాండిల్‌‌‌‌ను ఏర్పరిచింది. 21,850 దగ్గర రెసిస్టెన్స్‌‌‌‌ రావొచ్చు. 21,570 సపోర్ట్‌‌‌‌గా పనిచేస్తుంది’ అని వివరించారు.

2. గ్యాప్‌‌‌‌ అప్‌‌‌‌లో ఓపెన్ అయిన నిఫ్టీ, ఇంట్రాడేలో మరింత పెరిగిందని షేర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌ ఎనలిస్ట్ జతిన్ గేడియా అన్నారు. నిఫ్టీ  గత స్వింగ్ హై 21,750 ని దాటిందని చెప్పారు. ఈ బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌కు తన 40 రోజుల మూవింగ్ యావరేజ్‌‌‌‌ 21,200 దగ్గర సపోర్ట్ లభించిందని, అందువలన తాజా కన్సాలిడేషన్ ఫేజ్‌‌‌‌లో ఈ లెవెల్ స్ట్రాంగ్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌గా పనిచేస్తుందని అన్నారు. పైన 21,913 వరకు నిఫ్టీ పుల్‌‌‌‌బ్యాక్ ఉంటుందన్నారు.  

21,850–22,000 లెవెల్‌‌‌‌ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌‌‌‌గా పనిచేస్తాయని అన్నారు. రానున్న సెషన్లలో నిఫ్టీ 21,200 – 22,000 రేంజ్‌‌‌‌లో ట్రేడవ్వొచ్చని వెల్లడించారు. బ్యాంక్ నిఫ్టీ 46,000 – 46,200 వరకు పుల్ బ్యాక్ అవుతుందని అంచనా వేశారు. దిగువన 45,110 దగ్గర సపోర్ట్ లభిస్తుందని అన్నారు.