
- ఎంపికైన నిర్మల్ జిల్లా వాసులు
- నేడు సీఎం చేతుల మీదుగా అవార్డులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాకు చెందిన ఓ హెచ్ఎం, మరో టీచర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎంపికయ్యారు.మామడ మండలం పొన్కల్ జడ్పీహెచ్ఎస్ పీజీ హెచ్ఎం మైస అరవింద్ ఉత్తమ హెచ్ఎంగా, ఖానాపూర్ మండలం మస్కాపూర్ జడ్పీహెచ్ఎస్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బోనగిరి నరేందర్ ఉత్తమ స్కూల్ అసి స్టెంట్ గా ఎంపికయ్యారు. మైస అరవింద్ పొన్కల్ జడ్పీ హెచ్‌ఎస్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ స్కూల్‌గా నిలిపారు.
స్కూల్లో స్వయంగా ఆస్ట్రానమీ లేబరేటరీ ఏర్పాటుతోపాటు బోధనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఆయన చేపట్టిన చర్యలు ప్రశంసలందుకున్నాయి. రెగ్యులర్ గా స్కూల్‌కు హాజరయ్యే విద్యార్థులను గుర్తించి ప్రతినెలా సొంతంగా నగదు అందిస్తున్నారు. అక్కడి వీడీసీ, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారాన్ని తీసుకొని స్కూల్‌ను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దారు.
ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దిన నరేందర్
బోనగిరి నరేందర్ ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తూనే ఇన్చార్జి హెచ్‌ఎంగానూ వ్యవహరించారు. కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేలా హైటెక్ ప్రచారాన్ని చేసి జిల్లాలోనే అత్యధిక విద్యార్థులను నమోదు చేసి రికార్డు సృష్టించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు బోధనా నైపుణ్యాల పెంపునకు అనేక చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీరిద్దరు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో అవార్డులు అందుకోనున్నారు.