
నిత్యామీనన్, సత్యదేవ్ లీడ్ రోడ్ లో నటించిన స్కైలాబ్ మూవీ ట్రైలర్ రిలీజైంది. వాస్తవ ఘటనలకు కొద్దిగా హ్యూమర్ టచ్ ఇచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే.. బండ లింగపల్లి అనే గ్రామంలో నివసించే గౌరమ్మ (నిత్యామీనన్) ప్రతిబింబం అనే వార్తాపత్రికల్లో పనిచేస్తుంటుంది. చిన్న చిన్న వార్తలు కాకుండా ఒక పెద్ద వార్త కోసం వెతుకుతూ ఉంటుంది. అదే గ్రామానికి ఆనంద్(సత్యదేవ్) అనే వ్యక్తి డబ్బు కోసం ఏదోకటి చేయాలనీ వస్తాడు. అక్కడ అతనికి సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) పరిచయమవుతాడు. ఇద్దరు డబ్బుకోసం ప్రయత్నాలు మొదలుపెడుతుండగా.. అనుకోని ఘటనగా అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. దీంతో ఆ గ్రామంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. ఈ వార్తను తనకనుగుణంగా మలుచుకోవడానికి గౌరీ, ఆనంద్, రామారావు ప్రయత్నించడం, ఆ గ్రహ శకలాలు ఆ గ్రామంలో పడకుండా గ్రామస్థులు చిత్ర విచిత్రమైన పద్ధతులు పాటించడం హాస్యభరితంగా చూపించారు. ఎంతపెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు అని నిత్యామీనన్ చెప్పే డైలాగ్ బాగుంది. మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తిగా కట్ చేశారు. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించడం విశేషం. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ వారి పాత్రలకు జీవం పోసినట్లు కనిపించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్న ఈ మూవీ.. డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాకు నిత్యామీనన్ సహ నిర్మాత.