- సింథటిక్ కలర్స్, టేస్టీ సాల్ట్స్‌తో వంటకాలు
- కుళ్లిన చికెన్‌తో బిర్యానీ, మురికి పరిసరాల్లో స్వీట్స్ తయారీ
- అనుమతి లేకుండా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణ
- ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలు
నిజామాబాద్, వెలుగు : కల్తీ ఫుడ్స్పై ఫుడ్ సేప్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో నెల రోజులకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్తీ ఫుడ్స్ విక్రయించే 25 హోటళ్లు, పలు రెస్టారెంట్ల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఫుడ్స్ శాంపిల్స్ సేకరించి క్వాలిటీ చెక్ కోసం హైదరాబాద్‌కు పంపించారు. జిల్లాలోని ఫైవ్‌స్టార్ హోటళ్లు అయిన నిఖిల్, సాయివంశీ ఇంటర్నేషనల్, జవారియా, మధురసాయి, బావర్చీతోపాటు బోధన్ రోడ్డులోని పలు హోటళ్లలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేశారు.
బిర్యానీలో ప్రమాదకర సింథటిక్కలర్స్, రుచికరంగా ఉండేందుకు టేస్టీ సాల్ట్స్ వాడుతున్నట్లు నిర్ధారించారు. ఫ్రిజ్‌ల్లో కుళ్లిన చికెన్ నిల్వ చేసినట్లు గమనించారు. భీంగల్, కమ్మర్పల్లి మండలాల్లోని దుకాణాల్లో నాసిరకం సరుకులతో స్వీట్స్, ఖారా, బూందీ తయారు చేస్తున్నట్లు తేల్చారు. వంట నూనె, పిండి పదార్థాలు, మసాలాలతోపాటు 25 రకాల శాంపిల్స్‌ను క్వాలిటీ చెక్ కోసం హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
పలు సూపర్ మార్కెట్లలో తనిఖీలు చేసి ఎక్స్ పైరీ తేదీ లేని సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులను హెచ్చరించినట్లు వివరించారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలు పాటించడం లేదని, లైసెన్స్‌లు లేకుండానే షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వంటగది శుభ్రంగా ఉండాలని, నాణ్యమైన ఆహార పదార్థాలు వండాలన్న నిబంధనలను విస్మరిస్తున్నారన్నారు. హోటల్ సిబ్బంది తప్పకుండా మాస్క్‌లు, గ్లౌజ్‌లు వాడాలని చెప్పారు.
సింథటిక్ కలర్స్‌తో వ్యాధులు..
ఆహారపదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. స్వీటు షాపుల్లో ఉండే నోరూరించే కెమికల్స్‌తో తయారయ్యే రంగురంగుల మిఠాయిలు తింటే క్యాన్సర్ తోపాటు భయంకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఫుడ్ కలర్స్ వల్ల కిడ్నీలు దెబ్బతినడంతోపాటు ఉదర సంబంధ రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో హానికరమైన సింథటిక్ కలర్స్ వాడుతున్నారని, ఆ బిర్యానీ తింటే క్యాన్సర్‌తోపాటు గుండె జబ్బులు, నరాల బలహీనత, ఎముకల క్షీణత వంటి సమస్యలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.
జిల్లాలోని హోటళ్లు..
జిల్లాలో నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు, 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 25 లక్షల జనాభా ఉంది. నిజామాబాద్‌నగరంలో చిన్నాపెద్ద కలిపి 400 హోటల్స్ ఉండగా, వాటిలో 11 స్టార్ హోటల్స్ తరహాలో నడుస్తున్నాయి. ప్రతి పల్లెలో టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు ఉండగా, పలు పేర్లతో 32 రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి.
ఘుమఘుమల మాటున..
హోటళ్లు, రెస్టారెంట్లు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలు రకాల ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కల్తీ కలర్స్, టేస్టీ సాల్ట్స్, మసాలాలు దట్టించి ఘుమఘుమల మాటున కల్తీ వంటకాలు పెడుతూ జనాలను అనారోగ్యంలోకి నెట్టేస్తున్నారు. దీనికితోడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్వీటు షాపుల్లోనూ పదార్థాలను కల్తీ చేస్తున్నారు. రకరకాల రసాయన ప్లేవర్స్, కల్తీ పదార్థాలతో ఐటెమ్స్ తయారు చేసి అమ్మూతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
యాక్షన్‌తో పాటు అవగాహన పెంచుతాం..
రెగ్యులర్ ఆఫీసర్ లేక జిల్లాలో ఇప్పటి వరకు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ సరిగా జరగలేదు. అక్టోబర్‌లో పూర్తి స్థాయి ఆఫీసర్‌గా చేరిన తర్వాత విస్తృత తనిఖీలు చేపడుతున్నాం. సింథటిక్ కలర్స్, టేస్టెడ్ సాల్ట్ వంటలు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్లకు నోటీసులు జారీ చేశాం. హైదరాబాద్‌కు పంపిన శాంపిల్ రిపోర్టులు రాగానే చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారపదార్థాలు అమ్మే వారికి గరిష్టంగా రూ.5 లక్షల ఫైన్, జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రజల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే 9059809823ను సంప్రదించాలి. - సునీత, జిల్లా ఫుడ్ సేప్టీ ఆఫీసర్
