- రూ.22.40 లక్షల జరిమానా
- సీపీ సాయిచైతన్య వెల్లడి
నిజామాబాద్, వెలుగు : ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 232 మందిపై కేసులు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య శనివారం ప్రకటనలో తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చగా రూ.22.40 లక్షల జరిమానాతో పాటు ఆరుగురికి వారం రోజుల జైలు శిక్ష కూడా పడిందన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు మరింత పెంచామన్నారు. ఈ క్రమంలో పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.10 వేలకు తగ్గకుండా జరిమానాలు పడుతున్నాయన్నారు. లిక్కర్ సేవించి బైక్‌లు నడపడం మానాలని సీపీ సూచించారు.
డోర్‌లాక్ సమాచారం ఇవ్వండి..
సంక్రాంతి పండగకు ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లే కుటుంబాలు లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సీపీ సాయిచైతన్య సూచించారు. కాలనీల్లో గస్తీ టీంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డోర్లకు సెంట్రల్ లాక్ సిస్టం వాడాలని, సీసీ కెమెరాల్లో చెక్ చేసుకోవాలన్నారు. తాము ఊళ్లకు వెళ్తున్న సమాచారాన్ని సోషల్ మీడియాలో గానీ వాట్సాప్ స్టేటస్‌లో గాని పోస్టు చేయొద్దన్నారు. శివారు కాలనీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇరుగుపొరుగు వారు కనిపెట్టుకొని ఉండేలా విజ్ఞప్తి చేయాలన్నారు. ఇండ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్దులు అపరిచితులను నమ్మొద్దన్నారు. ఆపద సమయంలో డయల్ 100 కు ఫోన్ చేయాలన్నారు.
