పంట మార్పిడి చేయమంటారు.. వేస్తే పట్టించుకోవడం లేదు

పంట మార్పిడి చేయమంటారు.. వేస్తే పట్టించుకోవడం లేదు
  • సబ్సిడీ గాని.. సబ్సిడీ విత్తనాలు కూడా ఇవ్వడం లేదు
  • మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల ఆవేదన

మెదక్: రైతులంతా  ఒకే పంట  వేసి  ఆగం కావొద్దని.. రైతులు వివిధ రకాల  పంటలను సాగు చేస్తూ.. పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు  సాధించాలని  ప్రభుత్వం పదే పదే  చెప్తుంది. రైతులు  అనుకున్న స్థాయిలో  లాభాలు పొంది   లక్షాధికారులు  కావొచ్చని ఊక దంపుడు  ఉపన్యాసాలు ఇస్తుంది. కానీ కొత్త పంటల వైపు  వెళ్లిన రైతులకు సహాయం మాత్రం  అందడం లేదు. ఆ పంటకు  సబ్సిడి విత్తనాలు ఇస్తాం ...ఈ పంటకు ప్రోత్సాహకాలిస్తామంటూ వేదికల మీద.. మీడియా ఎదుట కథలు మాత్రమే  చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో  అలాంటిదేమి లేదని వాపోతున్నారు రైతులు. 
పొలం సారవంతం కోసం పంట మార్పిడి చేయడాన్ని అందరూ ఒప్పుకుంటారు.. కానీ కొత్త రకం పంటలు వేసి దెబ్బతింటే సహాయం మాట దేవుడెరుగు తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం.. అధికారుల మాటలతో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామ శివారులో నాలుగేళ్ల కిందట 40 ఎకరాల భూమిని  కొనుగోలు చేశారు పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన నాగినేని వెంకటరావు. వరంగల్ జిల్లా డోర్నకల్ దగ్గర 10 ఎకరాల్లో అయిల్ ఫామ్ తోట చూసిన వెంకటరావు...వాళ్ల సలహాలతో తాను ఫామ్ అయిల్  సాగు ప్రారంభించాడు. నర్సరీల్లో ఒక్కో మొక్క 120 నుంచి 190 రుపాయల పెట్టి కొనుగోలు చేశారు. 20 ఎకరాల్లో సాగు చేస్తున్న అయిల్ ఫామ్ చెట్ల కోసం రెండు పెద్ద సంపులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీటిని పొదుపుగా ఉపయోగించుకునేందుకు వీటికి డ్రిప్ సిస్టమ్  ఏర్పాటు చేసి మొక్కలకు నీటిని అందిస్తున్నారు. మిగతా పంటల కన్నా మెయింటనెన్స్ తక్కువగా ఉంటుందని అయిల్ ఫామ్ వేశామంటున్నారు వెంకటరావు.  అయితే సర్కార్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆయిల్ ఫామ్  సాగు చేస్తున్న తనలాంటి వారికి వ్యవసాయ శాఖ వాళ్లు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వడం లేదన్నారాయన. మెదక్ లో వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అందిస్తే ఇంకో 6 ఎకరాలకు అయిల్ ఫామ్ ను విస్తరించాలని ఆలోచిస్తుంటే.. అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయిల్ ఫామ్ అమ్మాలంటే ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని.. దగ్గర్లో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని అధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడే లేరని వాపోయారు. 
నాలుగేళ్ల కిందట సెంట్రల్ యూనివర్సిటీ టీమ్  ఇక్కడి నేలలు పరిశీలించి  అయిల్ ఫామ్ సాగుకు సరిపోవని చెప్పారని, గాలిలో తేమ శాతం తక్కువగా ఉందని రిపోర్ట్ ఇవ్వడంతో మెదక్ జిల్లాకు అయిల్ ఫామ్ సబ్సిడీని ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. అయితే  వెంకటరావు పామ్ అయిల్ తోటను పరిశీలించిన అధికారులు ... మిగితా రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చని చెప్పారని, ప్రభుత్వం నుంచి  సబ్సిడీ వచ్చేలా చూస్తామన్నా ఇంత వరకు ఆచరణలోకి రాలేదన్నారు.  జిల్లాలో ఆయిల్ ఫామ్ కు సబ్సీడీ ఇస్తే మరింత మంది రైతులు సాగు చేసే అవకాశం ఉందంటుని వెంకటరావు పేర్కొన్నారు.