
- యువకుడిని దారుణంగా చంపిన మైనర్..ఢిల్లీలో ఘోరం
న్యూఢిల్లీ: బిర్యానీ తినాలనుకున్న ఓ మైనర్(16).. కేవలం రూ.350 కోసం18 ఏండ్ల యువకుడిని దారుణంగా హత్య చేశాడు. 60 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపి, డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం పొందాడు. రెండు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ‘వెల్‌కమ్’ ఏరియాలో ఈ నెల 21 రాత్రి 11 గంటల సమయంలో 18 ఏండ్ల యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అతనిపై ఓ మైనర్ఒక్కసారిగా దాడి చేశాడు. తన దగ్గరున్న కత్తితో వెనువెంటనే పొడవడంతో.. ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత అతడిని ఒక ఇరుకైన సందులోకి ఈడ్చుకు వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అతడు చనిపోయేంత వరకు మెడపై కత్తితో పొడిచిన బాలుడు.. చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం కొన్నిసార్లు తలను అటు ఇటు తన్నాడు.
చనిపోయాడని తెలిసి, డెడ్‌బాడీ పక్కనే డ్యాన్స్ చేశాడు. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి వెళ్లామని పోలీసులు చెప్పారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారని డీసీపీ జాయ్ టిర్కీ తెలిపారు. 18 ఏండ్ల యువకుడిని దోచుకునే క్రమంలో.. ఆ మైనర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, బిర్యానీ తినడం కోసం మృతుడి వద్ద నుంచి రూ.350 దొంగిలించినట్టు ఒప్పుకున్నాడని, ఆ సమయంలో తాను మత్తులో ఉన్నట్లు చెప్పాడని డీసీపీ పేర్కొన్నారు.