
- 25 క్వింటాళ్లకు రూ.2 వేల ఖర్చు
- తీరనున్న రైతుల కష్టాలు
యాదాద్రి, వెలుగు : వడ్లలో తేమ శాతం తగ్గించడానికి సివిల్‌సప్లయ్ ఆఫీసర్లు డ్రయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. తేమ కారణంగా వడ్ల కొనుగోలు ఆలస్యమవుతుంది. దీంతో రోజుల తరబడి వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు సెంటర్లలో రైతులు వెయిట్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టడానికి ఆఫీసర్లు డ్రయ్యర్లు తెప్పిస్తున్నారు.
17 శాతం తేమ ఉంటేనే..
నిబంధనల ప్రకారం వడ్లలో 17 శాతం తేమ ఉంటే వడ్ల కొనుగోలు సాఫీగా సాగుతుంది. యాసంగి సీజన్లో కోతలకు ముందు.. కొనుగోలు సమయాల్లో అకాల వర్షాలు కురుస్తుంటాయి. వానాకాలం సీజన్సమయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. దీంతో మార్కెట్లు, కొనుగోలు సెంటర్లలో వడ్లు ఆరబోయడం, తేమ శాతం తగ్గిన తర్వాతే కాంటా పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ కారణంగా వడ్ల కొనుగోలులో ఆలస్యం జరుగుతోంది. దీంతో కొనుగోలులో జాప్యం జరగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.
డీజిల్ ఖర్చుపై నో క్లారిటీ..
డ్రయ్యర్లు వచ్చినా వీటిని ఉపయోగించినప్పుడు డీజిల్‌కు అయ్యే ఖర్చు రైతు భరిస్తాడా..? మార్కెట్‌కమిటీ భరిస్తుందా..? అనే విషయంలో స్పష్టత లేదు. 25 క్వింటాళ్ల వడ్లలో 25 శాతం తేమ ఉంటే.. దానిని 17 శాతానికి తగ్గించాలంటే కనీసం గంటన్నర టైమ్పడుతుంది. ఇందుకోసం డ్రయ్యర్కు కనీసం 10 లీటర్ల డీజిల్, ట్రాక్టర్‌కు 5 లీటర్ల డీజిల్ వినియోగించాల్సి ఉంటుంది. దీంతో పాటు డ్రైవర్‌కు చెల్లించాల్సిన డబ్బు లెక్కిస్తే కనీసం రూ.2 వేల ఖర్చు అవుతుంది.
ఇంత మొత్తం డబ్బు రైతులు చెల్లిస్తారా..? మార్కెట్ కమిటీ నుంచి చెల్లిస్తారా..? అనే విషయంలో స్పష్టత రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. మార్కెట్ కమిటీ నుంచి ఖర్చు చేస్తారని అనుకుంటే ప్రతి రైతు డ్రయ్యర్ ద్వారా వడ్లలో తేమ శాతం తగ్గించుకోవడానికి పోటీ పడతారు. ఖర్చు రైతు భరించాలంటే.. కొంతమంది మాత్రమే ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ సంఖ్యలో ఉండే చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ నడుస్తోంది. కాగా ఈ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్‌తోపాటు ఎఫ్ పీవో సెంటర్లతో కలిపి 325 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాకు రెండు డ్రయ్యర్లు..
వడ్లలో తేమ శాతం సమస్య త్వరగా పరిష్కరించడానికి సివిల్‌సప్లయ్ ఆఫీసర్లు డ్రయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒక్కో డ్రయ్యర్కు రూ.14.40 లక్షల చొప్పున వెచ్చించి రెండింటిని కొనుగోలు చేశారు. వీటిని వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించనున్నారు. ఈ డ్రయ్యర్లను ముందుగా వలిగొండ, చౌటుప్పల్మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేశారు. మరో మూడు డ్రయ్యర్లు కొనుగోలు చేయనున్నారు. ఇవి వచ్చిన తర్వాత ఆలేరు, మోత్కూరు, రామన్నపేట మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేయనున్నారు.