18 ఏళ్లకే మహిళా క్రికెటర్ రిటైర్మెంట్.. మిగిలిన జీవితం నా మతానికే

18 ఏళ్లకే  మహిళా క్రికెటర్ రిటైర్మెంట్.. మిగిలిన జీవితం నా మతానికే

పాకిస్తాన్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయేషా నసీమ్ జులై 20వ తేదీ గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయేషా నసీమ్ తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా తెలియజేసింది. 

ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్‌ తరపున 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ కోసం ఎంపికైంది. మార్చి 3  2020న థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.  ఆ తర్వాత 2020 డిసెంబర్ లో  దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టుకు సెలక్ట్ అయింది. అదే నెల ఆమె PCB మహిళా ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఇక జూలై  12  2021న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే  ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

తన కెరీర్‌లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్‌.... వరుసగా 369,33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్‌ తరపున 2023 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌పై ఆడింది. అదే విధంగా 2023  మహిళల టీ20 ప్రపంచకప్‌లో  భారత జట్టుపై నసీమ్‌ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. సూపర్ హిట్టింగ్ తో పరుగుల వరద పారించే  ఆయేషా  క్రికెట్ కు వీడ్కోలు పలకడం పాకిస్తాన్‌ కు గట్టి ఎదురు దెబ్బ.