లోకల్ బాడీ ఎన్నికలకు.. రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

 లోకల్ బాడీ ఎన్నికలకు..  రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్  విజయేందిర బోయి
  • పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో లోకల్​ బాడీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్  విజయేందిర బోయి కోరారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మోడల్  కోడ్  ఆఫ్  కండక్ట్(ఎన్నికల నియమావళి)ను పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు  సపోర్ట్  చేయాలన్నారు. 

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్  సూచనల మేరకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటినీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిమితి తదితర అంశాలను  కలెక్టర్  వివరించారు. అడిషనల్  కలెక్టర్  మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకట్​రెడ్డి, డీపీవో పార్థసారథి, ఆర్డీవో నవీన్  పాల్గొన్నారు.

రైతు సేవా కేంద్రం తనిఖీ..

చిన్నచింతకుంట: మండలకేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్  విజయేందిర బోయి తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల స్టాక్  రిజిస్టర్లను పరిశీలించారు, పంపిణీ ఎలా జరుగుతుందనే విషయంపై ఆరా తీశారు.  రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం ద్వారా అమ్ముతున్న ఎరువులు, ఫస్టిసైడ్స్​కు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. యూరియా కొరత లేదని, ఎప్పటికప్పుడు ఆగ్రోస్  కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. డీఏవో వెంకటేశ్, తహసీల్దార్  ఎల్లయ్య, ఏవో రాజేశ్ ఖన్నా పాల్గొన్నారు.

బ్రిడ్జిని పరిశీలించిన అడిషనల్  కలెక్టర్..

కౌకుంట్ల, ఇస్రంపల్లి వాగుపై ఉన్న బ్రిడ్జిని అడిషనల్  కలెక్టర్​ మధుసూదన్  నాయక్  పరిశీలించారు.  మంగళవారం వాగు దాటుతూ యువకుడు గల్లంతై చనిపోగా, బిడ్జిని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్​ చేయాలని అధికారులకు సూచించారు.