ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 17కు చేరిన మృతుల సంఖ్య

ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 17కు చేరిన మృతుల  సంఖ్య
  • 46వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

మనీలా : ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలకు తోడు వరదలు ముంచెత్తడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మృతుల సంఖ్య  17కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరో 26 మంది గల్లంతయ్యారు. వరద నీరు ఇండ్లను, ఊర్లను ముంచెత్తడంతో 46 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది వరదల్లో కొట్టుకుపోవడం వల్ల చనిపోయారని విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ తో కొండ చరియలు విరిగిపడడంతో మరణించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరదల ధాటికి కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

భారీ వర్షాలు కొనసాగుతుండడంతో ఫిలిప్పీన్స్‌లోని తొమ్మిది ప్రావిన్సుల్లోని రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మందిని ఎక్కడికక్కడ గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.