- ఆర్బీఐ రిపోర్టుతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డయ్: మోదీ
- ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్నే కోరుకున్నరు
- దుష్ప్రచారాలు చేస్తున్నోళ్లు అభివృద్ధికి శత్రువులని ఫైర్
- ముంబైలో రూ. 29 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ముంబై: దేశవ్యాప్తంగా గత మూడు నాలుగు ఏండ్లలోనే కొత్తగా 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైందన్నారు. నిరుద్యోగం పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నవాళ్ల నోళ్లు ఈ రిపోర్ట్ తో మూతపడ్డాయన్నారు. ముంబైలోని గోరెగావ్ సబర్బ్ లో రైల్వే, రోడ్లు, పోర్టు సెక్టార్లలో చేపట్టిన రూ.29 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎంప్లాయ్ మెంట్ పై ఆర్బీఐ ఇటీవల సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గత మూడు నాలుగేండ్లలోనే 8 కోట్ల కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తితో విపత్తు వచ్చినప్పటికీ కోట్లాది ఉద్యోగాలు పెరిగాయి” అని మోదీ అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు పెట్టుబడులకు, మౌలిక వసతుల అభివృద్ధికి, దేశ వృద్ధికి శత్రువులని ప్రతిపక్షాలపై ఆయన ఫైర్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అత్యంత అవసరమని, తమ ప్రభుత్వం ఈ దిశగానే పనిచేస్తోందన్నారు. ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి రావడాన్ని చిన్న, పెద్ద ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారని, ఎన్డీయే సర్కారు ఒక్కటే స్థిరమైన పాలనను అందజేయగలదని దేశ ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ముంబైలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులతో సిటీకి, దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు మధ్య కనెక్టివిటీ బాగా పెరుగుతుంద పేర్కొన్నారు.
గ్లోబల్ ఫిన్ టెక్ క్యాపిటల్ గా ముంబై..
వికసిత్ భారత్లో మహారాష్ట్ర పాత్ర కీలకమని, ప్రధానంగా ముంబైని గ్లోబల్ ఫిన్ టెక్ క్యాపిటల్ గా మార్చాలన్నదే తమ లక్ష్యమని మోదీ చెప్పారు. ‘‘ముంబైలో మెట్రో విస్తరణ వేగంగా సాగుతోంది. పదేండ్ల కింద 8 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో రైల్ నెట్వర్క్ ఇప్పుడు 80 కిలోమీటర్లకు పెరిగింది. మరో 200 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో నేషనల్ హైవేల పొడవు మూడింతలు అయింది. ఠాణె, బొరివలీ ప్రాంతాలను కలిపే ట్విన్ టన్నెల్స్ వల్ల రెండు ఏరియాల మధ్య కొన్ని నిమిషాల్లోనే ప్రయాణించే అవకాశం ఏర్పడింది” అని మోదీ చెప్పారు. ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ సేతుతో రోజూ 20 వేల వెహికల్స్ ప్రయాణిస్తున్నాయని, రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గడంతో రోజూ రూ. 25 లక్షల ఫ్యూయెల్ ఆదా అవుతున్నట్టు నిపుణులు అంచనా వేశారన్నారు. అలాగే పాల్ఘర్ జిల్లా దహనులో రూ. 76 వేల కోట్లతో పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపామని, ఈ పోర్టుతో
10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
అంబానీ ఇంట పెండ్లికి మోదీ హాజరు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, ఇండస్ట్రియలిస్ట్ వీరేన్ మర్చంట్ బిడ్డ రాధికా మర్చంట్ పెండ్లి వేడుకకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంత్, రాధిక పెండ్లి వేడుక శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగగా.. శనివారం నూతన వధూవరులకు ఆశీర్వాద వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీతో మోదీ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంత్, రాధిక దంపతుల ‘శుభ్ ఆశీర్వాద్ (బ్లెస్సింగ్ సెరెమనీ)’కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్లు, వివిధ పార్టీల నేతలతో సహా అనేక మంది ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.