దిందా పోడు రైతుల పాదయాత్రకు బ్రేక్

దిందా పోడు రైతుల పాదయాత్రకు బ్రేక్
  • అల్వాల్‌‌ వద్ద రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • ప్రత్యేక బస్‌‌లో సొంతూరుకి.. 

కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : పోడు భూములను తమకే కేటాయించాలని డిమాండ్‌‌ చేస్తూ ఆసిఫాబాద్‌‌ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ రైతులు ఎనిమిది రోజులుగా చేస్తున్న పాదయాత్రకు గురువారం బ్రేక్‌‌ పడింది. సీఎంను కలిసేందుకు హైదరాబాద్‌‌కు వెళ్తున్న రైతులను గురువారం ఉదయం అల్వాల్‌‌ వద్ద పోలీసులు అడ్డుకొని ప్రత్యేక బస్సుల్లో సొంతూరికి తరలించారు. ఈ విషయం బీఆర్‌‌ఎస్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌‌ఎస్‌‌.ప్రవీణ్‌‌కుమార్‌‌ రైతులను తీసుకొస్తున్న వాహనాలను కాగజ్‌‌నగర్‌‌ సమీపంలో అడ్డుకొని, రోడ్డుపై బైఠాయించారు.

దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రవీణ్‌‌కుమార్‌‌ను అదుపులోకి తీసుకొని కౌటాల పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించగా... పోడు రైతుల్లో కొందరిని ఆసిఫాబాద్, మరికొందరిని వాంకిడి స్టేషన్లకు తరలించారు. ప్రవీణ్‌‌కుమార్‌‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు కౌటాల పీఎస్‌‌కు చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 

తర్వాత బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు కుమ్రం భీం చౌరస్తా వద్దకు చేరుకొని సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు పోడు రైతుల అరెస్ట్‌‌ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్టేషన్‌‌ వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు గ్రామ సమీపంలోనే నిలిపివేశారు. సీఐ సంతోష్‌‌కుమార్‌‌, ఎస్సై నరేశ్, కమలాకర్, విజయ్, సాగర్‌‌లు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం ఆర్‌‌ఎస్‌‌.ప్రవీణ్‌‌కుమార్‌‌ను, రైతులను విడిచిపెట్టారు.