ఇండియా ఓపెన్‌‌‌‌ వాయిదా

ఇండియా ఓపెన్‌‌‌‌ వాయిదా

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు మరో బ్యాడ్మింటన్‌‌ టోర్నీ పోస్ట్‌‌పోన్‌‌ అయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌‌ క్వాలిఫయింగ్‌‌ ఈవెంట్లలో ఒకటైన ‘ఇండియా ఓపెన్‌‌’ను వాయిదా వేస్తున్నట్లు బ్యాడింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (బాయ్​) సోమవారం ప్రకటించింది. దేశంలో వైరస్‌‌ విజృంభణ వేగంగా ఉండటంతో మరే ఆప్షన్‌‌ తమ వద్ద లేదని వెల్లడించింది. షెడ్యూల్‌‌ ప్రకారం ఈ టోర్నీ మే 11 నుంచి 16 వరకు ఢిల్లీలో జరగాల్సి ఉంది. ‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్‌‌ ఏమాత్రం బాగా లేదు. ఇది ఇలాగే కొనసాగితే టోర్నీని నిర్వహించడం అసాధ్యం. బీడబ్ల్యూఎఫ్‌‌తో పలు దఫాలుగా చర్చించిన తర్వాత వాయిదా నిర్ణయం తీసుకున్నాం’ అని బాయ్‌‌ పేర్కొంది. ఇక కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఒలింపిక్‌‌ చాంపియన్‌‌ కరోలినా మారిన్‌‌, వరల్డ్‌‌ మాజీ చాంపియన్‌‌ రచనోక్‌‌, డెన్మార్క్‌‌ జోడీ అండ్రెస్‌‌ అంటోన్‌‌సెన్‌‌, రామస్మస్‌‌ గెమ్కీ.. ఇండియా ఓపెన్‌‌ నుంచి తప్పుకున్నారు. ‘228 మంది ప్లేయర్లు ఎంట్రీలు పంపారు. కోచ్‌‌లతో కలిపి ఈ సంఖ్య 300లకు పెరిగే చాన్స్‌‌ ఉంది. ఈ టైమ్‌‌లో ఇంత మందిని ఒకే దగ్గర ఉంచి టోర్నీని కండక్ట్‌‌ చేయడం రిస్క్‌‌తో కూడిన పని. అందుకే టోర్నీని వాయిదా వేస్తున్నాం’ అని బాయ్‌‌ పేర్కొంది.