109 స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్

 109 స్కూల్స్ లో  ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్
  • పంద్రాగస్టు నుంచి కొత్తగా ప్రారంభం
  • బోధనకు ప్రత్యేక టీచర్ల నియామకం

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మరిన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఫస్ట్ ఫేజ్ లో ఒక్క సిద్దిపేట జిల్లాలో 29 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేశారు. రెండో విడతలో సిద్దిపేటలో మరికొన్ని స్కూళ్లతో పాటు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రీ ప్రైమరీ స్కూళ్లను  ఏర్పాటు చేయనున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 109  స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభానికి విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. 

ప్రీ ప్రైమరీ లో చేరే విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేకంగా టీచర్లను సైతం నియమించనున్నారు. పంద్రాగస్ట్ నుంచి ఆయా చోట్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సారి ప్రీ ప్రైమరీ లో చేరే విద్యార్థులను వచ్చే ఏడాది ఫస్ట్ క్లాస్ లో చేరుస్తారు. 

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలో 27 చోట్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మండలాల వారీగా నిజాంపేట్ లో 4, హవేలీ ఘనపూర్ లో 3, కౌడిపల్లిలో 3, చిన్న  శంకరంపేటలో 3, మెదక్ లో 2, పాపన్నపేటలో 2, రామాయంపేటలో 2, తూప్రాన్ లో 2, కొల్చారం, నర్సాపూర్, పెద్దశంకరంపేట, శివ్వంపేట, వెల్దుర్తి, టేక్మాల్​ మండలాల్లో ఒక్కో స్కూల్ లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో మొదటి ఫేస్ లో 29 స్కూళ్లలో, ఇప్పుడు మరో 20 స్కూల్స్ లో  ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే మొత్తం49 చోట్ల ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కొనసాగనుంది. ముంపు గ్రామాలకు చెందిన ఏటిగడ్డ కిష్టాపూర్ తదితర గ్రామాల స్కూల్స్ తో పాటు జీరో స్టూడెంట్స్ ఉన్న మాటిండ్ల వంటి గ్రామాల్లో స్కూల్స్ కూడా ఆ లిస్టులో ఉండగా కలెక్టర్ అప్రూవల్ తర్వాత ఫైనల్ చేయనున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

 సంగారెడ్డి జిల్లాలో సెకండ్ ఫేజ్ లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. రెండో విడతలో మొత్తం 62 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ పంపిన ప్రపోజల్ ఆధారంగా ఆయా స్కూళ్లను ఎంపిక చేయగా, నాలుగేళ్లు పైబడి ఉన్న స్టూడెంట్స్ ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో చేర్చుకోనున్నారు. రానున్న విద్యా సంవత్సరానికి వాళ్లందరినీ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.