
- వానలు పడితే నరకంగా మారుతున్న ప్రయాణం
- రోజుల తరబడి గ్రామాలకు రాకపోకలు బంద్
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో బ్రిడ్జిల నిర్మాణాలు ప్రారంభించి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొద్దిపాటి వాన పడినా వాగులు పొంగి రోడ్లు, కాజ్‌వేలు నీట మునుగుతుండడంతో రోజుల తరబడి గ్రామాల మధ్య రాకపోకలు స్థంభించిపోతున్నాయి. వానాకాలానికి ముందే పనులు పూర్తి చేయాల్సిఉన్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనాపురం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న హైలెవెల్ వంతెన నిర్మాణం పూర్తయి ఆరు నెలలు కావస్తోంది. ఈ వంతెన 2023 లో రూ.9.25 కోట్ల అంచనాతో మంజూరు అయ్యింది. 18 పిల్లర్లతో పాటు స్లాబ్ వేసి కాంట్రాక్టర్ వంతెన పనులు పూర్తి చేశారు.
వంతెనకు రెండువైపుల 700 మీటర్ల అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.4.50 కోట్లతో ఆర్ అండ్ బీ ఆఫీసర్లు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇప్పటివరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వంతెన పూర్తయినా వినియోగంలోకి రాలేదు. వనపర్తి, ఆత్మకూరు మధ్య నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో గతంలో ఉన్న కాజ్ వే మీదుగా వరద నీటిలో వాహనాలు రాకపోకలు కొనసాగించాల్సివస్తోంది. సరళా సాగర్. శంకర సముద్రం పొంగి కాజ్వే పైకి చేరడంతో ఏటా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 2022లో నీటి ఉధృతికి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వరద నీరు వెళ్లేందుకు 80కి పైగా సిమెంట్ పైపులు వేసి కాజ్ వే నిర్మించారు.
ఇందులో కొన్ని పైపుల్లో పూడిక పేరుకుపోవడం, చెత్తా చెదారం అడ్డుగా ఉండడంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా కాజ్వే మీదకు చేరుతున్నాయి. సరళా సాగర్ సైఫన్ల నుంచి, శంకర సముద్రం నుంచి వచ్చే వరద నీటిలో కాజ్వే మునిగిపోతుంది. వరద ప్రవాహానికి 25 మీటర్ల పైగా రోడ్డు కోతకు గురైంది. రేవల్లి మండలంలో వర్షాలకు రోడ్లు దెబ్బతిని.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీరంగాపూరు మండలం జానంపేట బునాదిపురం మధ్య కాజ్‌వేపై నిర్మిస్తున్న వంతెన అర్ధంతరంగా నిలిచిపోయింది. 2009లో పిల్లర్లు వేశారు. నిర్మాణంలో క్వాలిటీ లేదంటూ అధికారులు నిర్మాణాన్ని ఆపారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలకు కాజ్వే కింద చిన్న పైపులేసి రోడ్డు వేసినా, వర్షం వచ్చి వరద నీరు పెరిగితే ఆ రోడ్డూ తెగిపోతుంది. అదే మండలంలోని శేరుపల్లి,- శ్రీరంగాపురం గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తున్నా .. అది ఇంకా పూర్తి కాలేదు. వంతెన రెండు వైపులా గోడలు నిర్మించాల్సి ఉంది.
పెబ్బేరు మండలం కిష్టారెడ్డిపేట, శేరుపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం రెండేళ్ల కింద మొదలైంది. ఇప్పటికీ పూర్తి కాలేదు. భారీ వర్షాలు పడి వాగు పొంగితే కొల్లాపూర్‌కు వెళ్లే ఈ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. నడిచిపోవాలన్నా జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.