మిత్రుడు వైఎస్‌ఆర్‌‌ కోసం దామన్న పదవీ త్యాగం

మిత్రుడు వైఎస్‌ఆర్‌‌ కోసం దామన్న పదవీ త్యాగం
  • పార్టీ టికెట్‌ ఇయకపోయినా ఇండిపెండెంట్‌గా దామోదర్‌‌రెడ్డి గెలుపు 
  • ఎన్టీఆర్‌‌ టీడీపీలోకి ఆహ్వానించినా.. కాంగ్రెస్‌తోనే పయనం 

సూర్యాపేట, వెలుగు: రాజకీయాల్లో ఎవరైనా మంత్రి పదవి కోసం పోరాటం చేస్తారు. కానీ తన మిత్రుడిని సీఎం చెయ్యాలని గట్టిగా మాట్లాడి క్యాబినెట్ మంత్రి పదవి, ఆ తర్వాతి ఎన్నికల్లో తనతో పాటు తన సొంత అన్న టికెట్ కూడా పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. 1993లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని సీఎంగా తప్పించే సమయంలో ఆయన క్యాబినెట్‌లో ఉన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జలగం ప్రసాద్ రావు.. వైస్సార్ ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు.  కానీ నాటి ప్రధాని పీవీ.. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎం చేశారు. దీంతో 1994 ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా అప్పటి సీఎం కోట్ల.. తన చిన్న కోడలు మేనమామ జన్నారెడ్డి సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. 

దామోదర్ రెడ్డి సొంత చెల్లెని సుధీర్ రెడ్డి అన్న శ్యాం సుందర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో  ‘నాకు టికెట్ ఇవ్వరా? సత్తా చూపుతా’ అని ఇండిపెండెంట్‌గా పోటీచేసి దామోదర్ రెడ్డి గెలుపొందారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించగా తుంగతుర్తిలో మాత్రం ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి అన్న రాంరెడ్డి వెంకటరెడ్డి 1,700 తేడాతో ఓడిపోయారు.

 1994 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్​కు కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని మొత్తం 21 స్థానాల్లో  కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలేదు. నాటి సీఎం ఎన్టీఆర్ టీడీపీలో చేరమని ఆహ్వానించినా దామోదర్‌‌రెడ్డి ఆ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ అనుబంధ సభ్యుడుగా ఉంటూ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డికే ఓటు వేశారు. ఆ తర్వాత10 ఏళ్ల తరువాత , ఎవరు  సీఎం కావాలని పోరాడారో అదే నేత వైస్సార్ క్యాబినెట్‌లో అన్నదమ్ములు(2004లో తమ్ముడు, 2009లో అన్న) ఇద్దరు మంత్రులుగా చేయటం ఒక రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఐదుసార్లు గెలిచి, మంత్రులుగా పనిచేసిన సోదరులు మరొకరు లేరు. 

అన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించి జిల్లాలో వరుసగా ఐదు సార్లు శాసనసభ్యునిగా ఒకసారి మంత్రిగా చేశారు. 2016లో వెంకటరెడ్డి  శాసనసభ్యుని హోదాలో మరణించారు. దామోదర్ రెడ్డి వరుస ఎన్నికల్లో గెలుస్తూ చివరి ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. 2014, 2018, 2023 సూర్యాపేట నుంచి వరుసగా ఓడిపోయారు.