మరో రెండేళ్లపాటు మారటోరియం పొడగించిన ఆర్బీఐ

V6 Velugu Posted on May 05, 2021

కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న సమయంలో భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని సూచించారు RBI గవర్నర్ శక్తికాంత దాస్. ఇవాళ(బుధవారం) ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వేళ దానిని ఎదుర్కొంటూ వ్యాపారాలు ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా గత రెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తూ ఊరటనిచ్చే ప్రకటన చేశారు శక్తికాంతదాస్. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు కరోనా సంబంధిత మౌలిక వసతుల కోసం రూ. 50 వేల కోట్ల కేటాయింపులు చేస్తామన్నారు.

 చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రస్తుత రెపో రేటుకు రూ. 10 వేల కోట్లు, రుణ గ్రహీతలకు రూ. 10 లక్షల వరకు తాజా రుణాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31 వరకు ఈ సదుపాయం అందిస్తామన్నారు. మే 20న రెండోసారి రూ. 35 వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని శక్తికాంతదాస్ తెలిపారు.

Tagged RBI, extended moratorium, two years

Latest Videos

Subscribe Now

More News