
- 152 మీటర్లు కాకుంటే.. 151 లేదా 150 మీటర్ల ఎత్తుతోనైనా బ్యారేజీ నిర్మించుకోవచ్చని సూచన
- మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేయాలని సలహా
- ఒప్పుకోకుంటే వేమనపల్లి వద్ద కట్టుకోవచ్చని రిపోర్ట్
- మేడిగడ్డ వద్ద నిర్మాణం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిక
- ఎక్స్పర్ట్స్సలహాలను పట్టించుకోకుండా కాళేశ్వరం కట్టి నిండా ముంచిన కేసీఆర్
- తుమ్మిడిహెట్టికి 2009లోనే 236 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్
- 205 టీఎంసీలకు క్లియరెన్స్ ఇస్తూ 2014లో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి లేఖ
- నాటి లేఖలు, ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్టులన్నీ బయటకు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాజీ సీఎం కేసీఆర్ తుమ్మిడిహెట్టిని బలిపెట్టారని తేలిపోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టొద్దని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టే మేలని 2015లోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టంగా చెప్పినా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని స్పష్టమైంది. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని, అది ఫీజిబుల్ కాదని, నీటిని తరలించడమూ కష్టమని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తేనే రాష్ట్రానికి మంచిదని నిపుణుల కమిటీ ఆనాడే కరాఖండిగా తేల్చి చెప్పింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణంపై స్టడీ చేయించేందుకు నాటి బీఆర్ఎస్ సర్కారు 2015 జనవరి 21న జీవో 28 జారీ చేస్తూ.. ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ స్థలంపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని జీవోలో పేర్కొంది. దాదాపు రెండున్నర నెలల పాటు స్టడీ చేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ.. 2015 ఏప్రిల్ 7న రిపోర్టును నాటి ప్రభుత్వానికి సమర్పించింది. గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులనూ ప్రస్తావిస్తూ.. తుమ్మిడిహెట్టి ఎందుకు మేలు? మేడిగడ్డ ఎందుకు వద్దు? అనేది క్షుణ్ణంగా వివరించింది. నిర్మాణ వ్యయం, బ్యారేజీల ఫీజిబిలిటీ, కరెంట్ ఖర్చులు, అదనపు భారంలాంటి వాటిని స్పష్టంగా రిపోర్టులో పేర్కొన్నది. కానీ, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రిపోర్టును బయటకు రానివ్వలేదు. ఇక, తుమ్మిడిహెట్టి వద్ద అసలు 165 టీఎంసీల లభ్యత లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. వాస్తవానికి 2009లోనే 236 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హైడ్రాలజీ క్లియరెన్సులు ఇచ్చింది. ఆ తర్వాత 2014లోనూ అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో 205 టీఎంసీలకు అనుమతులనూ ఇచ్చారు. ఆ రెండు రిపోర్టుల్లోని కీలక అంశాలు తాజాగా బయటకు వచ్చాయి.
150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించుకోవచ్చు
రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 మార్చి 24న ఏరియల్ సర్వే నిర్వహించింది. తుమ్మిడిహెట్టితో పాటు మేడిగడ్డ వద్ద బ్యారేజీలను నిర్మిస్తే ఎలాంటి లాభనష్టాలుంటాయో టోపోషీట్ స్టడీ ద్వారా అంచనాలు వేసింది. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మిస్తే మహారాష్ట్రలో 1,850 ఎకరాల పట్టా భూములు మునుగుతున్నాయని నిర్ధారించింది. ముంపుతో మహారాష్ట్ర ఒప్పుకోని పక్షంలో 151 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించవచ్చని సూచించింది. తద్వారా ముంపు 300 ఎకరాలు తగ్గి.. 1,550 ఎకరాలే మునుగుతాయని పేర్కొన్నది. ఒకవేళ అందుకూ మహారాష్ట్ర ఒప్పుకోకుంటే బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు తగ్గిస్తే ముంపు 600 ఎకరాలు తగ్గి.. 1,250 ఎకరాలుగా ఉంటుందని స్పష్టం చేసింది. బ్యారేజీ 2 మీటర్ల ఎత్తును తగ్గించినంత మాత్రాన ఎత్తిపోసే నీళ్లలో ఎలాంటి తేడాలూ ఉండవని తేల్చి చెప్పింది. ముంపు తీవ్రతను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. ఇక, అప్పటికే చేసిన కొన్ని ప్యాకేజీల పనులు, గ్రావిటీ కెనాల్ తవ్వకం వృథా పోదని, ఆర్థిక నష్టాలూ ఉండవని స్పష్టం చేసింది. కాబట్టి తుమ్మిడిహెట్టి వద్ద 151 లేదా 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ప్రభుత్వం ఒప్పించాలని సలహా ఇచ్చింది.
వేమనపల్లిని సూచించినా..
ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ వద్దనుకుంటే.. ప్రాణహిత నది మీదనే వేమనపల్లి వద్ద 112 మీటర్ల నుంచి 115 మీటర్ల ఎత్తు మధ్యలో బ్యారేజీని నిర్మిస్తే.. మహారాష్ట్రలో ఎలాంటి ముంపు ఉండదని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పేర్కొన్నది. అక్కడి 4 కి.మీ దూరంలో ఉన్న నీల్వాయి మీడియం ప్రాజెక్టుకు 160 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని సూచించింది. ఇక్కడ 15 మీటర్ల లిఫ్ట్ అవసరం అవుతుంది. అక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఎల్లంపల్లికి నీటిని సులభంగా తీసుకెళ్లొచ్చని, అక్కడ కేవలం 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నది. కానీ తుమ్మిడిహెట్టితో పోలిస్తే అదనంగా 40 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని, అదనంగా మరో 250 మెగావాట్ల కరెంట్ కావాలని పేర్కొన్నది. అక్కడ నిర్మాణ వ్యయం రూ. 600 కోట్లకు తోడు.. ఏటా రూ.220 కోట్లు కరెంట్ ఖర్చులకు కట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ప్యాకేజీ 1, 2, 4లలో తవ్విన గ్రావిటీ కాల్వలు నిరుపయోగంగా మారి.. రూ.700 కోట్లు వృథా అవుతాయని పేర్కొన్నది. ఆదిలాబాద్‌లో ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని వార్ధా వద్ద బ్యారేజీని నిర్మించి.. 1, 2, 4 ప్యాకేజీల్లోని గ్రావిటీ కాల్వల ద్వారా 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఇవ్వొచ్చని సూచించింది.
మేడిగడ్డతో అదనపు భారమే..
మేడిగడ్డ బ్యారేజీని 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. కానీ, 5 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణంపై స్టడీ చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీకి అప్పటి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే విషయాన్ని కమిటీ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. 105 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించవచ్చని తెలిపింది. కానీ, మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మిస్తే.. 318 మీటర్ల ఎత్తులో ఉన్న మిడ్‌మానేరుకు 160 టీఎంసీల నీటి తరలింపు ఆర్థిక భారంతో కూడుకున్నదని పేర్కొన్నది. 10 కాంపొనెంట్లు అదనంగా నిర్మించాల్సి వస్తుందని తెలిపింది. ‘‘5 కి.మీ.మేర బ్యారేజీ నుంచి టన్నెల్ ఇన్‌టేక్ వరకు అప్రోచ్ చానెల్, 10 కిలోమీటర్ల పొడవున 10.50 మీటర్ల ఎత్తుతో అటవీ ప్రాతం గుండా టన్నెల్, అక్కడ నుంచి 140 మీటర్లకు నీటిని ఎత్తిపోసేందుకు సర్జ్‌పూల్, పంప్‌హౌస్, డెలివరీ మెయిన్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. డెలివరీ సిస్టర్న్ నుంచి మానేరు నది వరకు 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌ను నిర్మించాలి. గ్రావిటీ కెనాల్ నుంచి గుండారం ట్యాంక్ వరకు 35 కిలోమీటర్ల పొడవున ట్విన్ టన్నెల్స్‌ను కొట్టాలి. ఆ టన్నెల్ చివరి నుంచి 185 మీటర్ల ఎత్తున ఉన్న గుండారం చెరువుకు నీళ్లిచ్చేందుకు ఓ లిఫ్ట్ కట్టాలి. మళ్లీ అక్కడి నుంచి సబితం చెరువుకు 3 కి.మీ మేర అప్రోచ్ చానెల్ నిర్మించాలి. అక్కడి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్‌కు నీళ్లిచ్చేందుకు 40 కిలోమీటర్ల పొడవున 10.5 మీటర్ల ట్విన్ టన్నెల్స్‌ను కిష్టంపల్లి వరకు ట్విన్ ప్రెజర్ టన్నెల్స్‌ను నిర్మించాలి. అక్కడ 321 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా మరో లిఫ్ట్‌ను నిర్మించాలి. అక్కడి నుంచి మోతెవాగు రిజర్వాయర్ గుండా ఫ్లడ్ ఫ్లో కెనాల్‌కు నీళ్లిచ్చేందుకు మరో 5 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలను తవ్వాలి. వీటన్నింటికీ దాదాపు రూ.24 వేల కోట్లు ఖర్చవుతుంది’’ అని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది.
తుమ్మిడిహెట్టికి 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 2009 ఏప్రిల్ 20న నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను సమర్పించింది. దానిని పరిశీలించిన కేంద్రం.. అదే ఏడాది జులై 27న 236 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొంటూ హైడ్రాలజీకి అనుమతులిచ్చింది. ఇక, ఆ తర్వాత 2010 ఏప్రిల్ 16న ప్రాజెక్టుకు సూత్రప్రాయ అనుమతులు వచ్చాయి. అదే ఏడాది అక్టోబర్ 8న నాటి ప్రభుత్వం కేంద్రానికి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సమర్పించింది. అక్కడి నుంచి దాదాపు నాలుగేండ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్ నడిచింది. 2014 అక్టోబర్ 24న అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఉమాభారతి.. రాష్ట్రానికి లేఖ రాశారు. 205 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెబుతూ వాటి వినియోగానికి అనుమతులిచ్చారు. అయితే, సరిగ్గా నెలకు అంటే 2014 నవంబర్ 24న అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. కేంద్రానికి నీటి లభ్యత లెక్కలపై మోడిఫైడ్ సిరీస్‌ను పంపించింది. ఆ తర్వాత 2015 ఫిబ్రవరి 16న మోడిఫైడ్ స్టడీస్‌పై మరోసారి బీఆర్ఎస్ సర్కారు లేఖ రాసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి 2015 మార్చి 13న రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి ఉమాభారతి.. 205 టీఎంసీలకు ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చినట్టు మరోసారి స్పష్టం చేశారు. అయితే, వరదలేని రోజుల్లో అక్కడ 160 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయా? లేదా? అన్నదానిపై స్టడీ చేయాలని సూచించారు. అంతేగానీ, అక్కడ 160 టీఎంసీల నీళ్లు లేవని ఆ లేఖలో ఆమె ప్రస్తావించలేదు.
2 వేల మెగావాట్ల కరెంట్ కావాలి
మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మిస్తే ఆ 3 లిఫ్టుల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 2వేల మెగావాట్ల కరెంట్ అవసరమవుతుందని కమిటీ నివేదిక తేల్చింది. అంతేగాకుండా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌లో టన్నెళ్లు, గ్రావిటీ కాల్వలను తాడిచర్ల, సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాల ద్వారా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నది. కాబట్టి అక్కడ టన్నెళ్లుగానీ, గ్రావిటీ కాల్వలనుగానీ తవ్వడం వీలు కాదని తెలిపింది. కాబట్టి ‘‘అక్కడ బ్యారేజీ నిర్మాణ ఆలోచనను మానుకోవాలి. ఇప్పటికే పనులను మొదలుపెట్టినా ఆపేయాలి. అక్కడ బ్యారేజీని కడితే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఖర్చూ భారీగా పెరుగుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించేందుకు కేవలం రూ.15,634 కోట్లే ఖర్చవుతుంది. కానీ, మేడిగడ్డ వద్ద కడితే ఆ ఖర్చు రూ.24 వేల కోట్లకు పెరుగుతుంది. అంటే రూ.8,366 కోట్లు అధికం. దానికి అదనంగా ఇప్పటికే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ మినహా వివిధ ప్యాకేజీల పనులను చేపట్టారు. దానికి ఇప్పటికే రూ.6 వేల కోట్లదాకా ఖర్చు చేశారు. మేడిగడ్డకు లొకేషన్ మారిస్తే ఆ రూ.6 వేల కోట్లు వృథా అయినట్టే. ప్యాకేజీ 8 పనులను ఆపేస్తే నిర్మాణ సంస్థ నుంచి అభ్యంతరాలూ వ్యక్తం అయి న్యాయ సమస్యలూ రావొచ్చు. అక్కడ తవ్విన కాల్వలను మట్టితో పూడ్చేందుకు మరో రూ.1500 కోట్లూ ఖర్చవ్వొచ్చు. మొత్తంగా ప్రభుత్వంపై రూ.15,866 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. వీటికి కరెంట్ ఖర్చులూ యాడ్ చేస్తే భారం మరింత ఎక్కువ అవుతుంది. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే 1600 మెగావాట్ల కరెంట్ సరిపోతుంది. అదే మేడిగడ్డ వద్ద నిర్మిస్తే అదనంగా 400 మెగావాట్లు కావాలి. అదనపు యూనిట్ల నిర్మాణానికిగానూ ఒక్క మెగావాట్‌కు రూ.6 కోట్లు వేసుకున్నా.. ఆ ఖర్చు రూ.2,400 కోట్లు అవుతుంది. ఏటా కరెంట్ఖర్చులు యూనిట్‌కు రూ.5 వేసుకున్నా.. 90 రోజులు లిఫ్ట్ చేస్తే రూ.420 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక, ఓ అండ్ఎం చార్జీల రూపేణా ఏటా రూ.120 కోట్లు ఖర్చవుతుంది. ఐదేండ్లకోసారి 5 శాతమూ పెంచితే భారం మరింత ఎక్కువ అవుతుంది’’ అని నివేదిక తేల్చి చెప్పింది. కాబట్టి మేడిగడ్డ వద్ద ఖర్చును, ఇతర ఆటంకాలు, ఎక్కువ సమయం తీసుకోవడంలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన మంచిది కాదని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక స్పష్టంచేసింది.