ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని.. ఫామ్ హౌస్ లో పెగ్గేసి పడుకుండా?

V6 Velugu Posted on Dec 07, 2021

పార్లమెంట్ లో , గాంధీ విగ్రహం వద్ద  టీఆర్ఎస్ ఎంపీల భాగోథాలు, నాటకాలను  తెలంగాణ సమాజం నిషితంగా గమనించిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో  కేంద్రం తమ మాట వినడం లేదని ఆందోళన చేసి సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్లాన్ ప్రకారమే చేశారన్నారు. మోడీ ఆదేశిస్తే..కేసీఆర్ పాటించారన్నారు. ఎందుకంటే.. వాళ్లు అంతర్గతంగా కొన్ని అంశాలను ప్రాతిపదికన చర్చించుకుని ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చారన్నారు. ఢిల్లీ మీద యుద్దం ప్రకటిస్తానని చెప్పిన కేసీఆర్..  ఢిల్లీ వెళ్లి నాలుగైదు రోజులు ఉండి ఇప్పటి వరకు  వరి కొనుగోళ్లపై ఎలాంటి కార్యచరణకు పూనుకోలేదన్నారు. ఢిల్లీ పర్యటనలో అగ్గి పుట్టిస్తానన్న కేసీఆర్..ఫామ్ హౌస్ లో పెగ్గేసి పడుకున్నారా అని ప్రశ్నించారు.

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రప్రభుత్వమే కారణమని.. మోడీ తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వరి కొనుగోళ్లపై సమస్యలు పరిష్కారం కాకుండానే వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు సమావేశాలను బహిష్కరించాలో చెప్పాలన్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకం చేసిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని  దేశంలోని 18 ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే..టీఆర్ఎస్ ఒక్కటే వరి కొనుగోళ్లపై ఆందోళనలు చేసి సమస్యను పక్కదారి పట్టించారన్నారు.మోడీ చేతిలో పావుగా మారిన కేసీఆర్ రైతుల ఇష్యూను పక్కదారి పట్టించారన్నారు. మోడీ ఆదేశిస్తే.. కేసీఆర్ పాటించారన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీలల్లో  కేసీఆర్ కు అంత్యంత సన్నిహితులైన.. రియల్ ఎస్టేట్ సంస్థలకు,సాగునీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలకు ,యజమానులకు ఈడీ నోటీసులిచ్చిందన్నారు. వారి నుంచి సమాచారం సేకరించిందన్నారు.  అబద్ధం అయితే తన ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించాలన్నారు.

Tagged KCR, paddy, Revanth reddy , trs mps bycott, parliment sessions

Latest Videos

Subscribe Now

More News