స్త్రీనిధి బకాయిలపై ఫోకస్

స్త్రీనిధి  బకాయిలపై ఫోకస్
  • రెవెన్యూ రికవరీ యాక్ట్​ అమలు చేయాలని సర్కారు ఆదేశం
  • బకాయిదారుల ఆస్తుల జప్తునకు అధికారుల కసరత్తు
  • జగిత్యాల జిల్లాలో రూ.23 కోట్లు పెండింగ్​

జగిత్యాల, వెలుగు: స్త్రీనిధి రుణాలకు సంబంధించిన బకాయిల వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు కిస్తీలు చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన సర్కారు బకాయిదారులపై రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) యాక్ట్​ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్​ను రెవెన్యూ శాఖ సెక్రటరీ జారీ చేశారు.  

రూ.475 కోట్లు మంజూరు

జగిత్యాల జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో మొత్తం 60,623 మంది సభ్యులున్నారు. వీరికి స్త్రీనిధి రుణాల కింద ఇప్పటివరకు రూ.475 కోట్లు ఇచ్చారు. వీటిపై కిస్తీల రూపంలో రూ.101 కోట్లకు గానూ ఇప్పటివరకు రూ.78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. సంఘాల సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రుణాలు ఇస్తోంది. వివిధ వ్యాపారాలు చేపట్టేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేస్తోంది.

అయితే ఈ పథకం కింద రుణాలు తీసుకున్న కొందరు సభ్యులు నెలల తరబడి కిస్తీలు చెల్లించకపోవడంతో రుణాలు మొండి బకాయిలుగా మారాయి. వాటిని వెంటనే చెల్లించాలని సెర్ప్, మెప్మా అధికారులు సూచిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది ద్వారా పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. 

ఆస్తులు లేకపోతే సభ్యులందరి బాధ్యత

రెవెన్యూ రికవరీ యాక్ట్​లో భాగంగా బకాయిదారుల భూములు, ఇళ్లు తదితర ఆస్తులను అధికారులు జప్తు చేసి బహిరంగ వేలం వేయనున్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని  స్త్రీనిధి బకాయిల కింద జమ చేయనున్నారు. ఒకవేళ సభ్యురాలి పేరిట ఎలాంటి ఆస్తులు లేనట్లయితే బకాయిలు చెల్లించే బాధ్యత సంఘంలోని సభ్యులందరిపై ఉంటుంది. అవసరమైతే గ్రూప్ సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేయనున్నారు. ఈ విషయమై స్త్రీనిధి జిల్లా అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇటీవల కలెక్టర్​ను కలిసి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది.  

బకాయిలు చెల్లించాలి

స్త్రీనిధి బకాయిల వసూలు విషయంలో ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బకాయిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెల్లించాలి. నిర్లక్ష్యం చేస్తే చట్టం ప్రకారం ఆస్తుల జప్తు వంటి చర్యలు తప్పవు.- రఘువరణ్, డీఆర్డీఏ పీడీ, జగిత్యాల