పెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు

 పెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు

దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తోంది. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా..చేయ గలిగిన చేవ ఉన్నా దేశ యువతరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. గతేడాది డిసెంబర్ నాటికి దేశ యువతలో  45.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి భారత్ చేరుకుంటుందనుకుంటున్న సమయంలో...నిరుద్యోగం పెరిగిపోతుండటం..దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని  సీఎన్ఎన్ మీడియా తెలిపింది. ఓ వైపు చెనాలో  వృద్ధుల సంఖ్యకు సమానంగా యువత లేదని..అయితే భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్యకు తగిన ఉద్యోగాలు లేవని  CNN నివేదించింది.

భారత్ లో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు దేశ జనాభాలో  40 శాతానికి పైగా ఉన్నారు. వీరిలో దాదాపు సగం మంది అంటే 45.8 శాతం మంది - డిసెంబర్ 2022 నాటికి నిరుద్యోగులుగా ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు సృష్టించేందుకు ఇదే సమయం అని పేర్కొంది. నిరుద్యోగుల సంఖ్యను బట్టి ఉద్యోగాలు సృష్టించకపోతే సామాజిక అశాంతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుంది. దీంతో ఉద్యోగాల పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నిరుద్యోగ సమస్య కూడా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

దేశంలో యువత నిరుద్యోగిత రేటు పెరిగిపోవడంతో "దిగ్భ్రాంతికరమైన అంశమని  కార్నెల్ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, భారత ప్రభుత్వానికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు తెలిపారు. 15 ఏళ్లుగా దేశంలో నిరుద్యోగతి రేటు నెమ్మదిగా పెరిగిపోతుందని..కానీ గత ఏడేళ్లుగా నిరుద్యోగిత రేటు అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే దేశానికి ఇది అతిపెద్ద ముప్పు, సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.