ఇటిక్యాల, వెలుగు: నేషనల్ హైవేపై గొర్ల మందను తుఫాన్ వాహనం ఢీకొట్టిన ఘటనలో పలు జీవాలు మృతిచెందాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన శివ, అంజనమ్మ దంపతులు శనివారం జాతీయ రహదారి మీదుగా గొర్ల మందను తీసుకెళ్తున్నారు.
కొండేరు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గొర్లు రోడ్డు దాటుతున్నాయి. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఆ మందను వేగంగా ఢీకొట్టింది. 30 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. తమకు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.
