
- మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి.. మెదక్ జిల్లాకు రూ.1.06 కోట్లు విడుదల
మెదక్, వెలుగు: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లకు మంచి రోజులు వచ్చాయి. అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 భవిత సెంటర్లు ఉన్నాయి. వీటిలో నాలుగు మెదక్, రామాయంపేట, నర్సాపూర్, పెద్ద శంకరంపేట ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్లు(ఐఆర్ఈసీ). ఈ నాలుగు చోట్ల భవిత సెంటర్లకు పక్కా భవనాలు ఉన్నాయి.
మిగతా 17 నాన్ ఐఈఆర్ సీలు. ఇవి ప్రభుత్వ, ప్రైమరీ స్కూళ్లలో కొనసాగుతున్నాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 1651 మంది ఉన్నారు. వారిలో 842 మంది బాలురు, 809 మంది బాలికలు. జిల్లాలో ఆరుగురు ఫిజియో థెరఫిస్టులు ఉండగా వారు వారానికి రెండు సార్లు భవిత సెంటర్లను సందర్శించి పిల్లలకు ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ సేవలు అందిస్తున్నారు. 58 మందికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. మొత్తం 20 మంది ఐఈఆర్ పీలు భవిత సెంటర్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. దివ్యాంగులైన పిల్లలను రెండేళ్లు ట్రైన్ చేసి రెగ్యులర్ స్కూళ్లలో చేయించాలనేది భవిత సెంటర్ల లక్ష్యం.
నిధుల కేటాయింపు ఇలా..
జిల్లాకు మొత్తం రూ.1.06 కోట్లు మంజూరు కాగా అవసరాన్ని బట్టి ఆయా భవిత సెంటర్లకు నిధులు కేటాయించారు. సెంటర్ల వారీగా మెదక్ కు రూ.12 లక్షలు, నర్సాపూర్ కు రూ.4.50 లక్షలు, నర్సాపూర్, పెద్దశంకరంపేటకు రూ.4 లక్షల చొప్పున, అల్లాదుర్గానికి రూ.2.50 లక్షలు, టేక్మాల్ కు రూ.3.50 లక్షలు, కొత్తపల్లికి రూ.3.50 లక్షలు, రేగోడ్ కు రూ.9.50 లక్షలు, చేగుంటకు రూ.2.50 లక్షలు, చిలప్ చెడ్ కు రూ.9.50 లక్షలు, కూచన్ పల్లికి రూ.2.50 లక్షలు, అప్పాజీ పల్లికి రూ. 2.50 లక్షలు, కాళ్లకల్ కు రూ.2.50 లక్షలు, మాసాయిపేటకు రూ.9.50 లక్షలు, సంకాపూర్ కు రూ.2.00 లక్షలు, నిజాంపేటకు రూ.2.50 లక్షలు, చిన్నశంకరంపేటకు రూ.2.50 లక్షలు, దొంతికి రూ.3 లక్షలు, తుర్కకర్రికి రూ.9.50 లక్షలు, వెల్దుర్తికి రూ.9.50 లక్షలు, కౌడిపల్లికి రూ.3.50 లక్షలు కేటాయించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో నాలుగు భవిత సెంటర్లు ఎంపిక చేయగా అందులో ఒకటి మెదక్. దీనిని మాడల్ గా తీర్చిదిద్దేందుకుకు రూ.12 లక్షలు మంజూరు చేశారు.
మౌలిక వసతుల కొరత తీరుతుంది
పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడంతో జిల్లాలో భవిత సెంటర్ల రూపు రేఖలు మారనున్నాయి. ముఖ్యంగా మౌలిక వసతుల కొరత తీరుతుంది. జిల్లాకు రూ.1.06 కోట్లు మంజూరు కాగా అందులో 50 శాతం నిధులు రూ.49,28,133 కలెక్టర్ అకౌంట్ లో జమయ్యాయి. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, పెయింటింగ్స్ తదితర పనులు చేపడుతాం. - రాజు, కమ్యూనిటీ మొబైలైజింగ్ ఆఫీసర్