
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- రూ.41 కోట్లతో రిపేర్లకు ప్రపోజల్
సూర్యాపేట, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల రహదారులపై గోతులు పడి దారుణంగా తయారయ్యాయి. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపించాయి. గతేడాది కురిసిన వర్షాలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో ఆ రోడ్లు మళ్లీ దెబ్బతిన్నాయి. ఈ గుంతల రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల దెబ్బతిన్న రోడ్లను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
50 చోట్ల దెబ్బతిన్న రోడ్లు..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్ బీ పరిధిలో 50 చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా సూర్యాపేట డివిజన్ పరిధిలో 26 చోట్ల రహదారులు డ్యామేజ్అయ్యాయి. ఇందులో సూర్యాపేట– దంతాలపల్లి మధ్య రహదారి భారీగా దెబ్బతిన్నది. మొత్తం సూర్యాపేట డివిజన్ పరిధిలో 866 మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు రిపోర్ట్ సిద్ధం చేశారు.
ఇక కోదాడ, హుజూర్ నగర్ డివిజన్ పరిధిలో 24 చోట్ల రోడ్డు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దూరాజ్ పల్లి,- గరిడేపల్లి, వెంపటి- జలాల్ పురం, మామిడాల-, కుంటాపల్లి, పిల్లలమర్రి, కోదాడ, అనంతగిరి, చిలుకూరు, జెర్రిపోతులగూడెం, దొండపాడు తదితర గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం జిల్లాలో 1066 మీటర్ల మేర రోడ్లు డ్యామేజ్అయ్యాయి.
రూ.41 కోట్లతో రిపేర్లకు ప్రపోజల్..
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు రూ.41 కోట్లతో మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించారు. సూర్యాపేట జిల్లాలో 22 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా మరమ్మతులకు రూ.22.50 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాగానే రోడ్ల మరమ్మతు పనులను ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.