వానాకాలం.. కరెంట్తో పైలం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి

వానాకాలం.. కరెంట్తో పైలం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్​గా ఉండాలి
  •  సమస్య ఉంటే టోల్​ఫ్రీ నంబర్​1912కు సమాచారం అందించాలి
  •  టీజీఎన్​పీడీసీఎల్​మంచిర్యాల ఎస్ఈ ఉత్తమ్​జాడే
  •  ప్రమాదాల నివారణకు పలు సూచనలు

మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు కరెంట్​తో జాగ్రత్త వహించాలని టీజీఎన్​పీడీసీఎల్​ మంచిర్యాల ఎస్​ఈ ఉత్తమ్​ జాడే సూచించారు. కరెంట్​పనులు, రిపేర్లు సొంతంగా చేసుకోవద్దని, అవగాహనతో మెలగాలన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లకు తాకరాదని, ప్రమాదకరంగా ఉంటే గమనించిన వెంటనే సంబంధిత సిబ్బందికి లేదా టోల్ ​ఫ్రీ నంబర్​1912కు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. 

పొలాల్లో రైతులు అలర్ట్​గా ఉండాలి

రైతులు పొలాల్లో నాణ్యతలేని మోటార్లు వినియోగించినప్పుడు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీస్​వైర్లకు ఇన్సులేషన్ సరిగా లేక కరెంట్​సప్లై కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి కరెంట్ మోటార్లను, పైపులను, ఫుట్ వాల్వులను తాకొద్దు. వ్యవసాయ పంపుసెట్లకు, స్టార్టర్లకు తప్పనిసరిగా ఎర్తింగ్​చేయాలి. వీటికి ఎర్తింగ్​ లేకపోవడం చాలా ప్రమాదకరం. విద్యుత్ కంచెల వల్ల రైతులే కాకుండా ఇతరులు కూడా ప్రమాదాల బారినపడుతున్నారు. విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇలాంటి ఫెన్సింగ్​లు ఏర్పాటు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 
    
మొబైల్ ​చార్జింగ్ పెట్టి తడి చేతులతో మాట్లాడం వల్ల షాక్​కు గురై చనిపోతున్నారు. చార్జింగ్ బంద్ చేసి మాట్లాడాలి. 
    
ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే రక్షించాలన్న ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోవద్దు. షాక్​కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి కర్ర, ప్లాస్టిక్ వస్తువులు వాడాలి. 
    
పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్​ఫార్మర్లు, పోల్స్​ దగ్గరికి వెళ్లకుండా కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వైర్లు కిందపడి ఉంటే పశువులు వాటిని తాకకుండా చూడాలి.
రైతులు, వినియోగదారులు కరెంట్ పనులను సొంతంగా చేసుకోవద్దు. ట్రాన్స్​ఫార్మర్ల దగ్గర ఫ్యూజులు మార్చడం, రిపేర్లు చేయడం, ఏబీ స్విచ్​లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడానికి విద్యుత్​ సిబ్బంది సహకారం తీసుకోవాలి. లేదా అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్​తోనే రిపేర్లు, ఇతర పనులు చేయించుకోవాలి.

దండేలు, పోల్స్, వైర్లతో జాగ్రత్త 

ఇండ్లలో బట్టలు ఆరేయడానికి చాలామంది జీఐ వైర్లను దండెంగా ఉపయోగిస్తున్నారు. వాటికి ఇన్సులేషన్ సరిగా లేకపోవడం వల్ల కరెంట్​సప్లై జరిగి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. వైర్లకు బదులుగా ప్లాస్టిక్ దండేలను ఉపయోగించాలి. పోల్​నుంచి కరెంట్​ సప్లై అయ్యే వైర్లను దండేలకు, ఇంటిముందు రేకులకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వైరింగ్​కు సరైన ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్​లు, సెల్​ఫోన్ చార్జర్లను ఉపయోగించాలి. ఇండ్లలో, వ్యవసాయ మోటార్లకు నాణ్యమైన, అతుకులు లేని సర్వీస్​ వైరును మాత్రమే వాడాలి.