సారూ.. ఇగ సాలు : సీనియర్​ జర్నలిస్ట్​ అంబట్ల రవి

సారూ.. ఇగ సాలు : సీనియర్​ జర్నలిస్ట్​ అంబట్ల రవి

అరాచకాన్ని, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ఏమాత్రం సహించని నేల నా తెలంగాణ. నాడు నిజాం రజాకార్ మూకలైనా, ఆ తర్వాత సీమాంధ్ర పెత్తందార్లయినా.. ఎవరినీ వదలలేదు. కర్రుకాల్చి వాతపెట్టింది. సామాన్యులే ఉక్కుపిడికిళ్లు బిగించి.. బరిగీసి పొలిమేరల దాకా తరిమారు. అది చరిత్ర మాత్రమే కాదు.. కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం.. చిరస్మరణీయం! పోరాటం తెలంగాణకు కొత్త కాదు. ఇది పోరు తెలంగాణ!! అలాంటిది.. కొట్లాడి, వేల ప్రాణాలను అర్పించి సాధించుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ అదే అరాచకం, అదే ఆధిపత్యం, అదే అహంకారం శృతి మించితే..!? ఈ నేల సహిస్తుందా?! కొత్త రాష్ట్రం కదా అని.. కొన్నాళ్లు ఓపిక పట్టింది. ఆ ఓపికను అలుసుగా చేసుకొని మరింత విర్రవీగితే.. పరిణామం ఎట్లుంటదో ఈ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

మొన్న పందేసాల కింద ఓయూకు పోయినప్పుడు నా దోస్తు, మలిదశ ఉద్యమకారుడు ఒకరు ఎదురుబదురైండు. ఆడ ఇంకో నలుగురైదుగురు జమైన్రు. ముచ్చట్ల ముచ్చట రాష్ట్ర రాజకీయాల మీదికి మళ్లింది. ‘‘అన్న.. ఆయన గన్క మళ్ల గెలిస్తే.. గల్లికొక విగ్రహం పెట్టుకుంటడేమోనే. జాతిపితనని రాయించుకుంటడేమోనే. ఇప్పటికే రిజర్వ్​ చేస్కున్నడట కదా! ఇగ పుస్తకాల నిండా ఆయన చరిత్రనే, ఆయన కాన్దాన్ చరిత్రనే ఉండెటట్టున్నది. ఇగ మన తరతరాలు అదే చదువాలె.. ఆ విగ్రహాలకు దండేసి దండం పెట్టాలె. గింత అద్మాన్నమా అన్న. కొట్లాడినోళ్ల సంగతేంది? అగ్గిని ముద్దాడిన, ఉరికొయ్యలకు ఏలాడిన అమరుల చరిత్ర ఏం గావాలె? దేనిమీదైతే మనం కొట్లాడినమో మళ్లా గదే మోపైంది.. గిట్లయితే ఉద్యమకారులంతా ముల్లెమూట సదుర్కోవాలె. జనం చేతుల్లనే ఉందంతా.. ఏం జేస్తరో సూడాలె” అని నా దోస్తు అంటుంటే.. ఏం జెప్పాల్నో సమజ్​ కాలే. మలిదశ ఉద్యమంలో ఓయూ గడ్డపై మా త్రివేణి హాస్టల్ ముంగట కండ్ల ముందు అగ్గిని ముద్దాడిన తమ్ముడు యాదయ్య.. ఠాగూర్ ఆడిటోరియం పొదలల్ల ప్రాణాలిడిచిన ఇషాన్​రెడ్డి.. ఇట్ల అమరులు యాదికొచ్చిన్రు. గుండె బరువెక్కింది. మా దోస్తు చెప్పింది జరిగితే ఏమవుతదని బుగులేసింది. ఎందుకంటే..

‘చావునోట్ల తలకాయపెట్టిన.. పక్షి లెక్క గల్లీకెంచి ఢిల్లీ దాకా తిరిగిన. నేను ఆమరణ దీక్ష చేస్తే గానీ తెలంగాణ రాలే. నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అని ముందుకు దుంకితే అప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశమంత’ అని సభలల్ల, సందు దొరికినప్పుడల్లా కేసీఆర్ ఊదరగొడ్తుంటే.. కొత్తగా వచ్చే తరానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?! పాలకుడు చెప్పిందే శాసనమవుతున్న కాలం ఇది. అలాంటిది ఎంతకూ తనచుట్టే తెలంగాణ చరిత్రను తిప్పుకోవడం, తెలంగాణ అంటేనే నేను.. తెలంగాణకు ముందు నేనే.. తర్వాత నేనే.. అనే స్థాయిలో కేసీఆర్ తరీఖ ఉంటే..  ఏ ఉద్యమకారుడికైనా మనసు దహించుకుపోదా? జెండాలు లేకుండా.. తెలంగాణ ఎజెండాతో ముందుకు కదిలిన ఉద్యమ గడ్డ ఓయూపై నాడు అందరిలో ఒకడిగా ఉద్యమించిన నాకూ అసుంటి మాటలు విన్నప్పుడల్లా బాధైతుండె. నాకే ఇట్లుంటే.. ముందుండి, అందరినీ నడిపించి కొట్లాడిన జేఏసీ లీడర్లకు, మేధావులకు, ప్రజా సంఘాల నేతలకు ఎట్లుంటది?! నాడు మలిదశ పోరు కోసం తెలంగాణలోని ప్రతి గడపలో ఒక ఉద్యమకారుడు ఉదయించిండు. ఊరూవాడా కలగలిసి కొట్లాడితే.. 1,200 మందికిపైగా వీరులు ప్రాణాలొదిలితే తెలంగాణ వచ్చింది. ఇది వాస్తవం. అందులో కేసీఆర్​ పాత్ర లేదనలేం. కానీ, తానే తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అనే రీతిలో ఆయన వైఖరి కనిపిస్తుంటే.. ప్రతిదానికి గప్పాలు, ఏతులు జెప్పుకుంటుంటే ఏ ఉద్యమకారుడు భరిస్తడు?! పైగా.. నోరుతెరిస్తే పాత్కం.. అధికారపక్షం నుంచి బెదిరింపులు, అణచివేతలు, అరాచకాలు. ప్రొఫెసర్​ కోదండరాం సార్​ లాంటి వాళ్లను కూడా వదలలేదు. దరువాజలు పగులగొట్టి అరెస్టు చేసిన దృశ్యం కదలాడుతున్నది. కేసీఆర్​ గప్పాలు, ఏతులే ఇప్పుడు ఆయనను సాగనంపినయ్.

ప్రశ్నించే గొంతుకలపై పైత్యం

తెలంగాణ ఉద్యమానికి.. ప్రజా సంఘాల ఆందోళనలకు.. ఉద్యోగులు, కార్మికుల ఆకాంక్షల సాధనకు వేదికైన ధర్నాచౌక్​ను ఎత్తేస్తున్నట్లు ఏనాడైతే కేసీఆర్ ప్రకటన చేసిండో.. ఆ నాడే ఆయన పతనం మొదలైంది. అస్తిత్వాన్ని చాటిచెప్పే ర్యాలీలు, సమ్మెలు, ధర్నాలు కండ్ల ముందు కనిపించొద్దన్న తీరుగా ఆయన  వ్యవహరించడం మేధావుల్లో, ఉద్యమకారుల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేకతను రగిలించింది. తెలంగాణ వచ్చిందే.. ర్యాలీలు, సమ్మెలు, ధర్నాలు అన్న చిన్న లాజిక్​ను ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్​ ఎట్ల మరిచిపోయిండో?! స్థానికులకు సమస్యలు వస్తున్నయని చెప్పి ధర్నాచౌక్​ ఎత్తేస్తానన్న కేసీఆర్​.. మరి, అదే జనం ట్రాఫిక్ జామ్​లతో తిప్పలు పడుతున్నరని చెప్పి బంజారాహిల్స్​లోని తన పార్టీ ఆఫీసును షిఫ్ట్​ చేస్తనన్లేదు ఎందుకో?!

అవి స్పీచ్​లా.. తిట్ల దండకాలా?

నాయకుడనేవాడు సంస్కారవంతంగా, నీతిమంతంగా ఉండాలని.. నలుగురికీ ఆదర్శంగా ఉండాలని తన చుట్టూ కొందరు మేధావులు గుమిగూడినప్పుడల్లా చెప్పే కేసీఆర్..  పబ్లిక్​ మీటింగ్స్, ప్రెస్​మీట్లలో నోరుపారేసుకోవడం కామన్​గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే.. ఆ రాష్ట్రంలోని ప్రజలందరికీ తండ్రిలాంటివాడు. కానీ, ఆ  తండ్రే ఇష్టమున్నట్లు మాట్లాడితే.. జనానికి ఏం సంకేతం పోతుంది. ఒకప్పుడు టీవీలల్ల కేసీఆర్ స్పీచ్​ కోసం ఎగబడి చూసిన జనం.. గత కొన్నేండ్ల నుంచి ఆ స్పీచ్​ వస్తుందంటే చాలు టీవీలను బంద్​ చేసే పరిస్థితి వచ్చింది. ప్రశ్నించేవాళ్లను, ప్రతిపక్షాలను రాయలేని మాటలతో తిట్టడం కేసీఆర్​ స్పీచ్​ల సారాంశంగా తయారైంది. మొన్నటికి మొన్న ఎన్నికల సభలో కూడా ‘ఏం అరుస్తున్నవ్​రా హౌలా..’ అంటూ జనాన్ని తిట్టడమేంది?! సభలో జనం లొల్లిపెడ్తె సముదాయించాలె. కానీ, ఇట్ల ఈసడించుకునుడేంది.. నోరుజారుడేంది?!  కేసీఆరే కాదు.. ఏ నాయకుడైనా సరే అది ప్రతిపక్షపోళ్లయినా, అధికారపక్షపోళ్లయినా హుందాగా ఉండాలె. మాటలు తూలొద్దు. లేకపోతే.. ఫలితం ఇప్పటి ఎన్నికల తీర్పులెక్కనే ఉంటది. సారూ.. ఇగ సాలు అనే పరిస్థితే ఉంటది.

ఆర్టీసీ కార్మికులను గోసపెట్టి..!

సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన ఉద్యోగులను, కార్మికులను కేసీఆర్​ ఎట్ల అణచివేసిండో.. ఆర్టీసీ సమ్మెనే ఓ చిన్న ఉదాహరణ. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. నెలన్నర రోజులు ప్రభుత్వం అరిగోస పెట్టింది. మీడియా ముందుకు వచ్చి కేసీఆర్​ చేసిన కామెంట్లకు ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు లోపల లోపల కుమిలిపోయిన్రు..! ‘‘గోస భరించలేక కొందరు కార్మికులు చనిపోతే.. చావులను కూడా హేళన జేసి మాట్లాడుతున్నరు. ఆర్టీసీని ప్రైవేట్​పరం జేస్తరట. కొలువులకెంచి తీసేస్తరట. పిల్లలను ఎట్ల సాదుకోవాలె.. ఎట్ల బతకాలె” ఇవీ సమ్మె టైమ్​లో ఓ ఆర్టీసీ కార్మికుడు గొడగొడ ఏడుస్తూ చెప్పిన మాటలు. ఈ గోస ఉత్తగనే పోతదా?!  

క్యారెక్టర్లను దెబ్బతీసి..!

మొన్నటికి మొన్న అశోక్​నగర్​లో నిరుద్యోగిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆ చెల్లి క్యారెక్టర్​నే దెబ్బతీసే ప్రయత్నాలు  జరగలేదా? అసలు ఆ అమ్మాయి గ్రూప్స్​ ఎగ్జామ్స్​కే  అప్లయ్ చేసుకోలేదని టీవీ చర్చల్లో సాక్షాత్తు బాధ్యతాయుతమైన మంత్రి (అప్పుడు) కేటీఆరే అనలేదా?! తొలిదశ ఉద్యమమైనా, మలిదశ ఉద్యమమైనా.. అస్తిత్వం, ఆత్మగౌరవం కోసమే కదా సాగింది. అసుంటిది సబ్బండవర్గాలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ అస్తిత్వం, ఆ ఆత్మగౌరవాన్ని మంటగలపాలని చూస్తే తెలంగాణ బిడ్డలు ఎట్ల సహిస్తరు? దాని ప్రతిఫలమే బీఆర్​ఎస్​ ఓటమి.

- అంబట్ల రవి, సీనియర్​ జర్నలిస్ట్​