వరదల్లో చనిపోయినోళ్లకూ పరిహారం పైసలియ్యలే!

వరదల్లో చనిపోయినోళ్లకూ పరిహారం పైసలియ్యలే!
  •   రూ.5లక్షల చొప్పున ఇస్తామన్న మంత్రులు
  •  20 రోజులవుతున్నాపట్టించుకోని ప్రభుత్వం  
  •  బాధిత కుటుంబాల ఎదురుచూపు
  •     ముగ్గురి శవాలు ఇంకా దొరకలే

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో జులై 26,27 తేదీల్లో వచ్చిన వరదల వల్ల  40 మంది చనిపోయారు. ముఖ్యంగా వరదల ఎఫెక్ట్​ ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనే ఏకంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రులు అప్పట్లో ప్రకటించారు. ఎస్డీఆర్​ఎఫ్​ కింద కేంద్రం ఇచ్చే మొత్తానికి మరో లక్ష కలిపి  రూ.5 లక్షల చొప్పున చనిపోయిన కుటుంబాలకు అందించాలని సర్కారు నుంచి ఆదేశాలు వచ్చినట్లు స్థానికంగా ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందలేదు. వరద బాధితులను రాష్ట్ర సర్కారు గాలికి వదిలేయడం, కనీసం చనిపోయినవాళ్ల కుటుంబాలనూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముగ్గురి శవాలే దొరకలే..

భూపాలపల్లి, ములుగు జిల్లాలలో వరదల వల్ల 22 మంది చనిపోగా, వీరిలో ఇప్పటికీ ఇంకా ముగ్గురి శవాలు దొరకలేదు. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లెకు చెందిన భార్యాభర్తలైన గొర్రె ఒదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గడ్డం మహాలక్ష్మి, గొంగిడి సరోజన వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురి శవాలు దొరకగా మహాలక్ష్మి మృతదేహం జాడ లేదు. ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం బూరుగుపేట గ్రామంలోని మారేడుగొండ చెరువు తెగి వరద ఉధృతికి బూరుగుపేట గ్రామానికి చెందిన బండ్ల సారయ్య ఇల్లు కొట్టుకుపోయింది. ఈ ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలైన బండ్ల సారయ్య, సారమ్మతో పాటు సారయ్య తల్లి సమ్మక్క వరద నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో సారయ్య మృతదేహం లభ్యం కాగా సారమ్మ, సమ్మక్కల మృతదేహాలు ఇంకా దొరకలేదు. దీంతో ఆఫీసర్లు వీళ్ల పేర్లపై పరిహారం డబ్బులు ఇచ్చేదిలేదని చెప్తున్నారు. డెడ్​బాడీలు దొరకకపోవడంతో డెత్​సర్టిఫికెట్లు రాక ప్రైవేట్​ ఇన్స్యూరెన్స్​పైసలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం ఇది. జులై 27న జంపన్నవాగు వాగు వరదలతో నీట మునిగిన ఇండ్లు ఇవి. ఆ రోజు వచ్చిన వరదలతో ఎనిమిది మంది వాగులో కొట్టుకుపోయి తెల్లారి పంటపొలాల్లో శవాలై తేలారు. కొండాయికి చెందిన తండ్రీ కొడుకులు షరీఫ్​ (55) అజహర్​ (24), భార్యాభర్తలైన ఎండీ. రషీద్​ ఖాన్ (73)​, కరీమా (69), మజీద్​ఖాన్​ (75) అతని భార్య లాల్​బీ (70), దబ్బగట్ల సమ్మక్క (70), మహబూబ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌(60)  చనిపోయారు. వీళ్లంతా నిరుపేదలే. ఈ కుటుంబాలకు సర్కారు సాయం అందలే. ఒక్కో కుటుంబానికి కేవలం రూ.10 వేల నగదు మాత్రమే ఇచ్చారు. చనిపోయిన ఒక్కొక్కరి పేరిట వాళ్ల  రూ.4 లక్షల చొప్పున అందిస్తామని స్వయంగా మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలే. 

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటస్వామి ఇల్లు ఇది. జూలై 27న రాత్రి భారీ వానకు చెట్టు కూలి ఇంటిపై పడటంతో వెంకటస్వామి నిద్రలోనే చనిపోయాడు. హన్మకొండలో ఉండే ఇతను జూలై 26న అనారోగ్యంతో స్వగ్రామంలోని సొంతింటికొచ్చాడు. ఒంటరిగా తన గుడిసెలో పడుకోగా తెల్లవారుజామున ప్రమాదవశాత్తు చెట్టుకూలి మరణించాడు. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు వివరాలు రాసుకొని శవ పంచానామా చేసుకొని వెళ్లారు. అంతే తప్ప ఇప్పటివరకు సర్కారు నుంచి పైసా సాయం చేయలేదు. వెంకటస్వామి డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన మృతితో భార్య అరుణ, కూతురు అంజలి బతుకు దుర్భరంగా మారింది. కనీసం ఇళ్లు కూడా లేకపోవడంతో పాలితిన్ కవర్ తో డేరా వేసుకుని తలదాచుకుంటున్నారు.

 పరిహారం ఎప్పుడిస్తరో..

మోరంచల్లి గ్రామంలో వచ్చిన వరదల్లో మా అమ్మనాన్నలు గొర్రె ఒదిరెడ్డి‒వజ్రమ్మలను పోగొట్టుకున్నం. మూడు, నాలుగు రోజుల తర్వాత శవాలు దొరికినయ్‌‌‌‌‌‌‌‌. సర్కారు నుంచి మాకు కేవలం రూ.10 వేల చొప్పున మాత్రమే సాయం అందింది. ఇది తప్ప ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఎప్పుడిస్తరో.. ఏమో తెల్వట్లేదు. 

‒ జయప్రద, మోరంచపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా

 సర్కారు నుంచి సాయం అందలే!

కొండాయిలో జంపన్నవాగు వరదల్లో చిక్కుకొని మా మామ మహమ్మద్ షరీఫ్ ఖాన్, మా బావమరిది నజీర్ ఖాన్ చనిపోయిండ్లు. ఇద్దరి మృతితో మా అత్త మున్నాబి అనాథగా మారింది. భర్త, కొడుకును తలుచుకొని ప్రతీ రోజు ఏడుస్తోంది. ఇద్దరు చనిపోయి 20 రోజులవుతున్నా  సర్కారు నుంచి ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇవ్వలేదు. ఎప్పుడిస్తరో ఎవ్వరూ చెప్పట్లే. 

 ‒ ఎస్.కె మహబూబ్ పాషా, కొండాయి, ములుగు జిల్లా 

త్వరలోనే చెక్కులు అందజేస్తం..

భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో వరదల వల్ల చనిపోయిన మూడు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున 
త్వరలోనే చెక్కులు అందజేస్తాం. గడ్డం మహాలక్ష్మి శవం ఇంకా దొరకలేదు.  అందువల్ల ఆమె వివరాలను సర్కారుకు పంపలేదు. ఆమె డెడ్​బాడీ దొరికితే ఆమె కుటుంబసభ్యులకు సైతం 
పరిహారం ఇస్తాం.

‒ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా, జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌

కూలిపోయిన ఇంటి ముందున్న ఈమె పేరు గంగిడి కౌసల్య. ఈమెది భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి. జూలై 27న వరదలకు మోరంచవాగు పొంగి ఊరు మునిగింది. అప్పుడు కౌసల్య, ఆమె తల్లి సరోజన ఈ ఇంట్లోనే ఉన్నారు. వరదకు తల్లి నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది. తల్లి చనిపోయి, ఇల్లు కూలిపోయి ఒంటరిదైన కౌసల్యకు రాష్ట్ర సర్కారు పదివేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈమెకు 

రూ.4 లక్షల చెక్కు ఇస్తామని చెప్పి వెళ్లిన ఆఫీసర్లు పత్తా లేరు

మోరంచపల్లిలో వరదలకు కొట్టుకుపోయిన గడ్డం మహాలక్ష్మి ఇల్లు ఇది. ఇంటి ముందున్న వాళ్లు మహాలక్ష్మి తల్లి బతుకమ్మ, పెద్ద కూతురు మయూరి. మోరంచవాగు పొంగి ఈ గ్రామంలో నలుగురు కొట్టుకుపోగా ముగ్గురి శవాలు దొరికాయి. 20 రోజులు దాటినా మహాలక్ష్మి శవం దొరకలేదు. కుటుంబసభ్యులు మహాలక్ష్మికి దశదిన కర్మ కూడా చేశారు. అయినా ఆఫీసర్లు డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలే. దీంతో ఆమె ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఇన్స్యూరెన్స్‌‌‌‌‌‌‌‌ డబ్బులు కూడా రావట్లే. సర్కారు నుంచి ఇవ్వాల్సిన రూ.4 లక్షల చెక్కు ఇయ్యలే. శవం దొరికితేనే డెత్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని చెబుతున్నరు.