మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె

మున్సిపల్  కార్మికుల మెరుపు సమ్మె

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీలో  పనిచేస్తున్న కాంట్రాక్ట్,  ఔట్​సోర్సింగ్​కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కార్మికులకి దహన సంస్కారాల  కోసం రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. వారు మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో  పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికురాలు గంగవ్వ చనిపోయినప్పుడు కార్మికులందరికీ  ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. 

రెండు రోజుల కింద ఇరుకోడు గ్రామానికి చెందిన మున్సిపల్ కార్మికుడు రాములు చనిపోవడంతో అతడికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చూస్తే మున్సిపాలిటీ నుంచి ఇన్సూరెన్స్ కోసం డబ్బులు చెల్లించలేదనే విషయం తెలియడంతో సమ్మెకు దిగినట్టు చెప్పారు. సమ్మె విషయం  తెలుసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ప్రస్తుత వైస్ చైర్మన్ కనకరాజు కార్మికులతో మాట్లాడి  రాములు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు సమ్మెను విరమించారు. కార్యక్రమంలో యూనియన్ కార్మికులు వినోద, నర్సింలు, రాజయ్య, ప్రమీల, రాజు, రమేశ్, సత్యం, బాల నర్సయ్య  పాల్గొన్నారు.