సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర

సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర

మూడక్షరాల సంగీతం..మనసును మైమరపించే సంతోషం. కష్టాన్ని..కాలాన్ని..మరిపించి..మానసిక ఆనందాన్ని..ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవని సంగీతం. సప్తస్వర సమ్మిళితం సంగీతం.  శాస్త్రీయ, జానపద సంగీతమైనా, పాప్‌ అయినా..ఇంకేదైనా..జనాలను  ఓలలాడించే శక్తి సంగీతానికే ఉంది.  పాటకు ఎల్లలు లేవు..పరికరాలతో పనిలేదు. జనజీవనంలో సంగీతం భాగం. గడ్డిపరకలో ఉంది సంగీతం..గడ్డపారలోనూ ఉంది సంగీతం. సంగీతం మనస్సను పులకరింపచేస్తుంది.. నరాల్లో రక్తాన్ని  ఉరకలేయిస్తుంది. కాబట్టి  సంగీతం లేని జీవితం ఊహించడం కష్టం. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు తోడుండేది సంగీతం. ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం 2022 సందర్భంగా  భారతీయ సంగీత పరిశ్రమలో  ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని.. ప్రపంచాన్ని వీడిన దిగ్గజ గాయకులను ఒకసారి స్మరించుకుందాం..ఈ సంగీత దినోత్సవం సందర్భంగా వారికి నివాళి అర్పిద్దాం. 

లతా మంగేష్కర్...భారతదేశపు నైటింగేల్. సంగీత ప్రపంచంపై లతా మంగేష్కర్ వేసిన ముద్ర ఎప్పటికి చెరగనిది. ఆమె స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయనిది. 1942లో మంగేష్కర్ సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ జనాల చెవుల్లో మారుమోగుతూనే ఉంది.  అజీబ్ దస్తాన్ హై యే', 'ఏ మేరే వతన్ కే లోగో', 'లుక్కా చుప్పి' వంటి తన మనోహరమైన పాటలు జనాల హృదయాల్లో సజీవంగా ఉంటాయి. లతా మంగేష్కర్ 980 సినిమాల్లో పాటలు పాడటం విశేషం.  దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది.  లతా మంగేష్కర్ కు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది.  అయితే  ఈ ఏడాది  ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్‌ కరోనా అనంతర వచ్చే ఆరోగ్య సమస్యలతో కన్నుమూసారు.

బప్పీ లహరి  హిందీ సంగీత దర్శకుడు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో ఆయన జన్మించారు. 19 ఏళ్ల  వయస్సులో  బప్పి లాహిరి బెంగాలీ చిత్రం 'దాదు'తో స్వరకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బప్పి లహిరి 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‏స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన ఆలపించిన 'చల్తే చల్తే', 'డిస్కో డ్యాన్సర్'​, 'షరాబీ' వంటి గీతాలను యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. బాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో చివరిగా డిస్కోరాజా చిత్రంలోనూ ఆయన పాట పాడారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 16న ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో అనారోగ్యంతో  మరణించారు. 

పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. మే 29, 2022న అతన్ని పంజాబ్‌లోని మాన్సా జిల్లా జవహర్కే గ్రామంలో దుండగులు  కాల్చి చంపారు. సిద్ధూ  భద్రతను పంజాబ్ పోలీసులు 424 మందితో ఉపసంహరించుకున్న మర్నాడే  ఈ సంఘటన జరిగింది. గాయకుడు సిద్ధూ  మృత్యుఒడిలోకి వెళ్లినా..అతను మిగిల్చిన సంగీత జ్ఞాపకాలు ప్రతి హృదయంలో సజీవంగా ఉంటాయి.  తన పాటల ద్వారా, సినిమా ద్వారా, కచేరీల ద్వారా ప్రజలకు దగ్గరయ్యాడు. ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకున్నా..అభిమానులకు మాత్రం ఆయనంటే ఇష్టం ఇసుమంతైనా తగ్గలేదు. 

ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి’... ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’లో ఇంత మధురంగా పాడిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (కెకె)  53 ఏళ్ల వయసులో  స్వర్గానికి చేరుకున్నాడు. కృష్ణకుమార్‌ కున్నత్‌  అంటే ఎవరు గుర్తుపట్టరు. సింగర్ కేకే అంటేనే జనాలకు తెలుసు. ‘ప్రేమదేశంలో  కాలేజీ స్టైలే పాడి..కుర్రాళ్లలో ఊపు తెచ్చాడు. హలో డాక్టర్‌ హార్ట్‌ మిస్సాయే అంటూ యువకుల హృదయాన్ని మిస్సయ్యేలా చేశాడు.  అంతేకాదు  ఖుషీలో ‘ఏ మేరా జహా... ఏ మేరి ఆషియా, వెంకటేష్‌ ‘వాసులో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే లాంటి హిట్స్.. కేకే గొంతు నుంచే  సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాయి.  అటు ఘర్షణలో ‘చెలియ.. చెలియా’ ఎప్పటికీ..మర్చిపోలేము.  కేకే మాతృభాష మలయాళం. అయినా  పుట్టి పెరిగిందంతా ఢిల్లీలోనే. ఢిల్లీలో మొదట అతను జింగిల్స్‌ పాడేవాడు. అలాగే హోటల్స్‌లో బ్యాండ్స్‌లో పెర్ఫార్మ్‌ చేసేవాడు. ఆ సమయంలోనే ఢిల్లీకి వచ్చిన హరిహరన్‌ అతడి పాట విని..ముంబై రా అని చెప్పాడు.

1994లో ముంబైకి వచ్చిన కేకేకు  విశాల్‌తో పరిచయం అయింది.  విశాల్‌ ‘మేచిస్‌’కు సంగీతం ఇస్తూ అందులో పెద్ద హిట్‌ అయిన ‘ఛోడ్‌ ఆయే హమ్‌ ఓ గలియా’ పాటలో ఒకటి రెండు లైన్లు ఇచ్చాడు. ఆ పాట హిట్‌ అయ్యింది. ఆ తర్వాత జింగిల్స్‌ పాడటం మొదలు పెట్టి జింగిల్స్‌ సింగర్‌గా చాలా బిజీ అయ్యాడు. 1994 నుంచి 1998 వరకూ నాలుగేళ్లలో 11 భాషల్లో 3,500 జింగిల్స్‌ పాడాటంటే అది అతని గొంతు మహిమ.1999లో ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలో ‘తడప్‌ తడప్‌ కే’... పాట సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు పాడటంతో కెకెకు ఇక తిరుగు లేకుండాపోయింది. కెకె మొత్తం పది భారతీయ భాషల్లో 700 పాటలు పాడాడు. వందల సంగీత ప్రదర్శనలు చేశాడు.  అయితే మే 31న  కోల్‌కతా నజ్రుల్ మంచ్‌లో  పాల్' పాట పాడాడు. అయితే అతను పర్ఫామ్ చేస్తుండగా..ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. డాక్టర్లను సంప్రదించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వెల్లడించారు. 

ఈ స్వర దిగ్గజాలు..భౌతికంగా మన మధ్య లేకున్నా..వారి స్వరం నుంచి ఉద్భవించిన పాటలు..ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి.  ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ సంగీత సామ్రాట్టులకు ఘన నివాళులు.