
- ప్రతి ఒక్కరికీ న్యాయం సులభంగా అందాలని వ్యాఖ్య
ఈటానగర్(అరుణాచల్ ప్రదేశ్): దేశంలో న్యాయ వ్యవస్థ, శాసన సభ, కార్యనిర్వాహక శాఖ ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. తక్కువ ఖర్చుతో వీలైనంత వేగంగా బాధితులకు న్యాయం దక్కేలా చూసేందుకే ఈ వ్యవస్థలు ఉన్నాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో కొత్తగా నిర్మించిన గౌహతి హైకోర్టు భవనాన్ని, ఈటానగర్ శాశ్వత బెంచ్‌ను చీఫ్ జస్టిస్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
‘‘శాసన సభ, న్యాయవ్యవస్థ, కోర్టులు.. రాజకుటుంబాల కోసమో జడ్జీల కోసమో లేవు. మనందరమూ ప్రజలకు న్యాయం అందించేందుకే ఇక్కడున్నాం” అని గవాయ్ పేర్కొన్నారు. అధికారాన్ని సామాన్యుల గడప వద్దకు తీసుకెళ్లడానికే (వికేంద్రీకరణ) మద్దతిస్తానని చెప్పారు. గదుల్లో న్యాయం బందీ కావొద్దని, ప్రజల గడపదాకా చేరాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి
న్యాయాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు గౌహతి హైకోర్టు జడ్జిలను గవాయ్ ప్రశంసించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని తెగల సంప్రదాయాలను, అరుణాచల్ ప్రదేశ్‌లోని 26 ప్రధాన తెగలు, 100కు పైగా ఉప-తెగల ఐక్యతను ఆయన కొనియాడారు. దేశం పురోగతి సాధించాలి కానీ, అందుకు మన సంస్కృతి, సంప్రదాయాలను ఫణంగా పెట్టకూడదని అన్నారు.
వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. ప్రతి పౌరుడికి దేశమే ఇల్లని, అదే మొదటి ప్రాధాన్యం కావాలన్నారు. దేశ ఐక్యతకు అంబేద్కర్ మద్దతిచ్చారని, ఐకమత్యమే దేశాన్ని బలంగా ఉంచుతుందని ఆయన నమ్మారని గవాయ్ గుర్తుచేశారు. ప్రతి మతానికి ఓ గ్రంథం ఉంటుంది కానీ, భారతీయులందరినీ బలంగా, ఐక్యంగా ఉంచే గొప్ప గ్రంథం రాజ్యాంగమేనని అన్నారు. అందరూ రాజ్యాంగానికి మొదటి విధేయులుగా ఉండాలని సీజేఐ సూచించారు.