
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (ఆగస్ట్ 10) రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2455 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగానే ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ విమానంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, యూడీఎఫ్ కన్వీనర్ ఆడూర్ ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడికున్నిల్ సురేష్, కె.రాధాకృష్ణన్‌తో పాటు తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్ ఉన్నారు. ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో వీరికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఎయిరిండియా స్పందిస్తూ.. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తోన్న ఎయిర్ ఇండియా AI2455 విమానంలో మార్గమధ్యలో సాంకేతిక సమస్య తలెత్తిందని వెల్లడించింది. పైలట్ విమానాన్ని వెంటనే చైన్నైకు దారి మళ్లించాడని తెలిపింది. సాంకేతిక సమస్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ అంతరాయం ఏర్పడిందని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని క్షమాపణలు చెప్పింది. విమానం చెన్నైలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, అక్కడ విమానంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రయాణికుల భద్రత తమ తొలి ప్రాధాన్యత అని తెలిపింది. ప్రయాణీకులను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. ప్లయిట్ రాడార్ 24.కామ్ డేటా ప్రకారం.. విమానం రాత్రి 8 గంటల తర్వాత తిరువనంతపురం నుంచి బయలుదేరి రాత్రి 10.35 గంటలకు చెన్నైలో ల్యాండ్ అయింది.
చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను భయంకరమైనదిగా అభివర్ణించారు ఆయరాయన. భయంకరమైన విషాదానికి దగ్గరగా వెళ్లివచ్చినట్లు ఉందని ప్రయాణ అనుభవాన్ని వివరించారు. తనతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆలస్యంగా బయల్దేరిన విమాన ప్రయాణం చివరకు భయంకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అల్లకల్లోలానికి గురయ్యామని.. విమానంలో సిగ్నల్ లోపం ఉందని కెప్టెన్ గంట తర్వాత ప్రకటించారని తెలిపారు. సాంకేతిక లోపంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని చెన్నైకు దారి మల్లించారని.. అక్కడ కూడా ల్యాండింగ్ అనుమతి కోసం 2 గంటలు పట్టిందన్నారు.
ల్యాండింగ్ కోసం ఎయిర్ పోర్టు చుట్టూ తిరుగుతూ ఎదురు చూశామని తెలిపారు. ల్యాండింగ్ సమయంలో అదే రన్ వేపై మరో విమానం ఉందని.. దీంతో మళ్లీ వెంటనే పైలట్ ఫ్లైట్‌ను గాల్లోకి తీసుకెళ్లాడని.. పైలట్ నిర్ణయం ప్రయాణకుల ప్రాణాలు కాపాడిందన్నారు. రెండో ప్రయత్నంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. పైలట్ నైపుణ్యం, అదృష్టంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతా అదృష్టంపై ఆధారపడి ఉండకూదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీసీఏ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విమానయాన అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి తప్పులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.