
- 590 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
- 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను మరోసారి ఓపెన్ చేశారు. ఎగువ నుంచి 77,563 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రాజెక్ట్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో ఎనిమిది క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి ఎడమకాల్వకు 7,518 క్యూసెక్కులు, కుడి కాల్వకు 6,182, ఏఎమ్మార్పీకి 1,800, విద్యుత్ ఉత్పత్తికి 29,151 కలిపి మొత్తం 77,563 క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడం, సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాగర్‌లోని కొత్త బ్రిడ్జి, పవర్‌హౌస్, ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్ల సమీపంలో, శివాలయం రోడ్‌లో సెల్ఫీలు దిగారు.
జూరాల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌కు వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 88 వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి గేట్ల ద్వారా 52,758 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 32,399, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, కోయిల్ సాగర్‌కు 315, రైట్ కెనాల్‌కు 470, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 50 కలిపి మొత్తం 86,633 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.