ఫైబర్​ గ్రిడ్​కు వైల్డ్​లైఫ్ ​అనుమతుల అడ్డంకి!

ఫైబర్​ గ్రిడ్​కు వైల్డ్​లైఫ్ ​అనుమతుల అడ్డంకి!
  • పాకాల వన్యప్రాణుల అభయారణ్యంలోని 13.5 ఎకరాలపై ప్రభావం
  • జింకలు, చిరుతలకు హాని కలగొచ్చని ఆందోళన
  • 5 ఎకరాల్లో మాత్రమే గ్రిడ్​ కేబుల్స్ వేసేలా అధికారుల ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: ఇంటింటికీ ఇంటర్నెట్​అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అటవీ, వన్యప్రాణుల సంరక్షణ రూపంలో చిక్కుముడులు ఏర్పడుతున్నాయి. టీ ఫైబర్​ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫైబర్​ గ్రిడ్​ ప్రాజెక్ట్​తో పాకాల వన్యప్రాణుల అభయారణ్యంలోని 13.5 ఎకరాల అటవీ భూములపై ప్రభావం పడుతుందని తెలుస్తున్నది. ఫైబర్​ గ్రిడ్​ కేబుల్స్​ మహబూబాబాద్​ జిల్లాలోని పాకాల అభయారణ్యం నుంచే వేయాల్సి ఉన్నది. 

ఈ నేపథ్యంలోనే అభయారణ్యంలో ఉన్న వివిధ రకాల జింకలు, చిరుత పులులు, అడవి పందుల వంటి జంతువులకు హాని కలిగిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్​ కోసం నేషనల్​ బోర్డ్​ ఫర్​ వైల్డ్​లైఫ్​ (ఎన్​బీడబ్ల్యూఎల్​) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును చేపడతామని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్​బీడబ్ల్యూఎల్​ అనుమతుల కోసం అప్లై చేసుకున్నట్టు తెలిసింది. 

అడవి జంతువులపై ప్రభావం పడకుండా చర్యలు

పాకాల వన్యప్రాణుల అభయారణ్యంలోని 13.5 ఎకరాల్లో కేవలం 5 ఎకరాల్లో మాత్రమే గ్రిడ్​ కేబుల్స్​ను వేస్తామని అధికారులు అంటున్నారు. కేబుల్స్​ కోసం చెట్లను నరకబోమని చెప్తున్నారు. గ్రిడ్​ కేబుల్స్​ కోసం అటవీ భూములను డైవర్ట్​ చేయడం తప్పదని పేర్కొంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్​ వల్ల అడవి జంతువులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. డిజిటల్​ తెలంగాణ ఇనిషియేటివ్​లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ ఇంటర్నెట్​ సౌకర్యాన్ని కల్పించాలనుకుంటున్నదని, దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. 

కేబుల్స్​ను ఎక్కువ శాతం రోడ్ల పక్క నుంచి వేస్తుంటారని.. అయితే, కొన్ని రోడ్లు అడవుల మధ్య నుంచి వెళ్తుండడంతోనే సమస్య ఏర్పడిందని, దానికి అటవీ అనుమతులు అవసరమని అంటున్నారు. కేబుల్స్​ కోసం అర మీటరు వెడల్పుతోనే గుంతలు తవ్వుతారని, దాంతో చెట్లను కొట్టేయాల్సిన అవసరం రాదని చెప్తున్నారు. నష్ట నివారణకు  కాంపా అకౌంట్​లో కొంత మొత్తాన్ని జమ చేయాల్సిందిగా వైల్డ్​ లైఫ్​ అధికారులు అడిగినట్టు తెలిసింది. గుంతలను తవ్వే పనిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.