తాలిబన్లు.. మహిళా మంత్రిత్వ శాఖ పేరు మార్చేశారు

 తాలిబన్లు.. మహిళా మంత్రిత్వ శాఖ పేరు మార్చేశారు
  • మహిళా శాఖ ఇకపై ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన శాఖ
  • షరియా చట్టం అమలు చేస్తామంటున్న తాలిబన్లు

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ ను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న తాలిబన్లు షరియా చట్టం మాటున అరాచక పాలనకు తెరలేపారు. మహిళలకు ఉద్యోగాలొద్దు... అస్సలు ఆటలే వద్దు.. చదువులు కూడా వేస్ట్ అంటూ రకరకాలుగా చెబుతున్న తాలిబన్లు ఇంటా.. బయటా ఒత్తిళ్లతో మెట్టుదిగుతున్నట్లు కనిపిస్తున్నా.. తమ మార్కు పాలన కొనసాగిస్తున్నారు.దీనికి తాజా నిదర్శనం మహిళల మంత్రిత్వశాఖ పేరు మార్పు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తున్నామంటూనే.. కాబుల్ విమానాశ్రయంలో సెక్యూరిటీ వింగ్ కోసం 16 మంది మహిళా ఉద్యోగినులను నియమించినా.. తాలిబన్ల పట్ల అనుమానాలు తొలగిపోలేదు. ఈ నేపధ్యంలో కొత్తగా కొలువుదీరిన తాలిబన్ల మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకపోవడంతో మహిళలు, ప్రజాస్వామ్య వాదులు అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా ఏకంగా మహిళా మంత్రిత్వ శాఖ పేరు మార్చేశారు. మహిళల మంత్రిత్వశాఖ పేరు ఇలాగే ఉంటే రేపెప్పుడైనా అడుగుతారనేమో.. మహిళా మంత్రిత్వ శాఖ భవనానికి ‘‘ధర్మ రక్షణ.. అధర్మ నిర్మూలన’’ శాఖ అని పేరు మార్చి అరబ్బీ, దరి భాషల్లో బోర్డులు ఏర్పాటు చేశారు.
తాలిబన్ల పాలన తీరుకు ఇదో తాజా నిదర్శనం మాత్రమేనని ఆఫ్ఘన్ పౌరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అమ్మాయిలు, మహిళలు చదువులొద్దన్న తాలిబన్లు తర్వాత మెట్టు దిగి కో ఎడ్యుకేషన్ లేకుండా చదువులు చెప్పాలని.. ఒకవేళ ఒకే తరగతిలో క్లాసులు నిర్వహిస్తే అమ్మాయిలు.. అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చినా తాత్కాలికమేననే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహిళల మంత్రిత్వ శాఖ పేరును మార్చేయడంతో తాలిబన్లు మారరనే అభిప్రాయం బలపడుతోంది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో మహిళలు, బాలికలను తనిఖీ చేయడం కోసం తప్పని పరిస్థితుల్లో కేవలం సెక్యూరిటీ కోసం మహిళా ఉద్య్యోగినులు తీసుకున్నారని.. ఇతర శాఖల్లో ఎక్కడా మహిళా ఉద్యోగినిలను తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. షరియా చట్టం మాటున మహిళలు, ప్రజల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్లు తమ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతుండడంతో అనేక మంది అవకాశం దొరికితే దేశం విడిచి వెళ్లిపోతే చాలు ప్రాణాలన్నా దక్కుతాయన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు.