ట్రక్కును హైజాక్ చేసి రెండున్నర టన్నుల టమాటాతో ఎస్కేప్

ట్రక్కును హైజాక్ చేసి రెండున్నర టన్నుల టమాటాతో ఎస్కేప్

2.5 టన్నుల టమాటాలతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన తమిళనాడుకు చెందిన దంపతులను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ట్రక్కు డ్రైవర్‌ నుంచి నగదు దోచుకునేందుకు వారు ఫేక్‌ యాక్సిడెంట్‌ని సృష్టించారని పోలీసులు తెలిపారు. వేలూరుకు చెందిన ఈ దంపతులు హైవే దొంగల ముఠాలో భాగమని, జూలై 8న చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన రైతు మల్లేష్‌ను చిక్కజాల వద్ద అడ్డగించారని చెప్పారు. తన ట్రక్కు తమ కారును ఢీకొట్టిందని చెప్పి, అందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో, అతడిపై దాడి చేశారు.

ఆ తర్వాత వారు 2 లక్షల 50వేల రూపాయలకు పైగా విలువైన టమాటాలు లోడ్ చేసిన వాహనంతో పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. చాలా నగరాల్లో రూ.100కి పైగా అమ్ముడవుతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.  

ఈ ఘటనలో రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్‌ఎంసీ యార్డు పోలీసులు వాహనం తరలింపుపై నిఘా పెట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. భాస్కర్ (28), అతని భార్య సింధూజ (26)లను జూలై 22న అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్ కోలారుకు టమాటా రవాణా చేస్తుండగా.. దొంగల ముఠా అతడిని అడ్డగించి ఈ తతంగానికి పాల్పడింది.