- 10వేల గ్రామాల్లో సభలకు ప్లాన్
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కమలం పార్టీ రెడీ అవుతోంది. ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. భరోసా కార్యక్రమంలో 10వేల గ్రామాల్లో సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ సభల ప్లాన్ అంతా బీజేపీ టాస్క్ మాస్టర్ సునీల్ బన్సల్ వర్కవుట్ చేయనున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన బైక్ ర్యాలీలను ఇప్పటికే తెలంగాణలో కూడా చేపట్టింది. 28 నియోజకవర్గాల్లో ప్రజాగోస -బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా జనవరి 20 నుంచి ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయింది. అయితే ఈసారి గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లనుంది కమలం పార్టీ. మొత్తం 10వేల గ్రామాల్లో పార్టీ గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.
బీజేపీ భరోసా యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత ఎక్కువగా పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలను గ్రామ సభలతో తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా గ్రామసభలు నిర్వహించి రెండోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఉత్తర ప్రదేశ్ లో గ్రామ సభల బాధ్యత అంతా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ వర్క్ ఔట్ చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా ఉత్తర్ ప్రదేశ్ ప్లాన్ ను అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమౌతోంది.