పెట్టుబడి సాయం రిలీజ్.. యాసంగి కోసం పాతపద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు

పెట్టుబడి సాయం రిలీజ్.. యాసంగి కోసం పాతపద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు
  • యాసంగి కోసం పాతపద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  • రైతు భరోసా స్కీమ్​ విధివిధానాలకు మరింత టైమ్​ పట్టే చాన్స్​
  • ఈలోగా రైతులకు ఇబ్బందులు రావొద్దని పాత పద్ధతిలోనే సాయం 
  • రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రెడీ చేయాలని సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ఈ యాసంగి సీజన్​కు సంబంధించి రాష్ట్రంలోని రైతులందరికీ పాత పద్ధతిలో పెట్టుబడి సాయాన్ని వెంటనే (సోమవారం నుంచే)  పంపిణీ చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరిగానే తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణానికి చెల్లింపులు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసాపై విధి విధానాలకు, కౌలు రైతుల గుర్తింపునకు మరింత టైమ్​ పట్టే అవకాశం ఉండటంతో పాత పద్ధతిలో (రైతుబంధు ప్రకారం) ముందుగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం నిర్ణయించారు. యాసంగి సీజన్​ ప్రారంభమవడంతో రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

వ్యవసాయ శాఖపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్​లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ రివ్యూలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. సీఎం రేవంత్  మాట్లాడుతూ.. రైతులకు వెంటనే యాసంగి రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సాయం అందించాలన్నారు. 

రైతు భరోసాపై చర్చ

కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైనా రైతు భరోసాపై రివ్యూలో విస్తృతంగా చర్చించారు. రైతు భరోసా ప్రకారం  రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 15,000 చొప్పున ఇవ్వాలి.  వ్యవసాయ కూలీలకు రూ. 12,000 చొప్పున,  వరి పంటకు బోనస్​ రూ. 500 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సీజన్​లో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తే ఏకంగా రూ.11 వేల కోట్లు అవసరమవుతాయి. 

పట్టారైతులతో పాటు కౌలు రైతులకూ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ఖజానా పరిస్థితి అంతంతంగా మాత్రంగానే ఉండటం, కౌలు రైతుల గుర్తింపు వంటివి చేయడం సమయంతో కూడుకున్న పని కావడంతో పాత రైతుబంధుతోనే ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. రివ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, ఇండస్ర్టీస్​ మంత్రి శ్రీధర్​ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అభిప్రాయం కూడా సీఎం రేవంత్​రెడ్డి తీసుకొని..  పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేసేందుకు ఓకే చేశారు. సమావేశంలో సీఎస్​ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​ రామ కృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.