పెద్ద చేపల గుడ్లు ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెద్ద చేపల గుడ్లు ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • చేపల వేట బంద్ .. గోదావరి నది, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల్లో 2 నెలలు నిషేధం
  • నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వర్తింపజేస్తూ ఆదేశాలు  
  • పెద్ద చేపల గుడ్ల ఉత్పత్తి కోసమేనంటున్న మత్స్యశాఖ  
  • చేపల వేట నిషేధంపై పరీవాహక ప్రాంతాల్లో ఆఫీసర్ల అవగాహన
  • ఫిష్ పాండ్ లలో పెంచిన చేపలే మత్స్యకారులకు ఆధారం

నిర్మల్, వెలుగు :  గోదావరి నదితో పాటు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ రాష్ట్ర మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్ వచ్చే ఆగస్టు చివరి వరకు కొనసాగించనుండగా..   మంగళవారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో  మత్స్యకారులు చేపల వేట నిలిపివేయాలని సంబంధత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే  గోదావరి నది పరివాహక గ్రామాలతో పాటు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. 

మత్స్య సహకార సంఘాలకు కూడా అధికారులు సమాచారం అందించారు.  ప్రస్తుతం గోదావరి నదితో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిర్మల్,  నిజామాబాద్ జిల్లాల మత్స్యకారులు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ నిషేధం రెండు జిల్లాలకు వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘించి చేపల వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,  సామగ్రి, రవాణా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. 

చేపలు గుడ్లు పొదిగేందుకోసమే.. 

రెండు నెలలు వర్షాల కారణంగా గోదావరి నదిలోనూ, ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరుతుంది. ఈ సమయంలో సహజ సిద్ధంగా పెద్ద చేపలు కోట్ల సంఖ్యలో గుడ్లు పెట్టి పొదుగుతాయి. అనంతరం చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. అదే మత్స్యకారులు చేపలను వేటాడితే గుడ్లు పెట్టి పొదిగే అవకాశాన్ని కోల్పోతాయని అధికారులు సూచిస్తున్నారు. దీని కారణంగానే చేపల సంఖ్య  తగ్గిపోయి ఉత్పత్తి పూర్తిగా పడిపోతుందంటున్నారు. తద్వారా చేపల కొరత ఏర్పడి, అమ్మకాలు లేక మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోతారని పేర్కొంటున్నారు. 

  ఫిష్ పాండ్ లలో పెంచినవే అమ్మకం

చేపల వేటపై నిషేధం కారణంగా మత్స్యకారులు ప్రత్యామ్నాయ దృష్టి సారిస్తున్నారు. కొంతకాలంగా నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఫిష్ పాండ్ లలో చేపల పెంపకం కొనసాగిస్తున్నారు. చాలామంది రైతులతో పాటు ఇతర వ్యాపారులు వ్యవసాయ క్షేత్రాల్లో ఫిష్ పాండ్ లను నిర్మించుకుని చేపలను పెంచుతున్నారు. వీరి వద్ద కొంతమంది మత్స్యకారులతోపాటు చేపల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై పూర్తి నిషేధం ఉండడంతో మత్స్యకారులు ఫిష్ పాండ్లలో పెంచిన చేపలను కొనుగోలు చేసి మార్కెట్లో అమ్ముకోనున్నారు.

 నిర్మల్ జిల్లాలో మత్స్య సహకార సంఘాలు 222 ఉండగా, వీటిలో13,129 మంది సభ్యులు ఉన్నారు. సంఘాల్లో సభ్యత్వం లేని మరో 5 వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేటపైనే జీవిస్తున్నారు. వీరంతా రెండు నెలల పాటు ఫిష్ పాండ్ ల చేపలను కొనుగోలు చేసి అమ్ముకోవాల్సి ఉంటుంది.