
- 1,500 మంది పోలీసులతో
- 15 యూనిట్లు: డీజీపీ
- తొలి 2 యూనిట్లకు శిక్షణ పూర్తి
- హుస్సేన్ సాగర్ వద్ద ప్రదర్శనను వీక్షించిన డీజీపీ, ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలు కాపాడే అత్యంత కీలకమైన ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ను అందుబాటులోకి తెచ్చామని డీజీపీ జితేందర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) పైనే ఆధారపడకుండా రాష్ట్ర స్థాయిలో సత్వరం సేవలు అందించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కీలకంగా పనిచేస్తాయని డీజీపీ చెప్పారు.
తొలి రెండు యూనిట్లు శిక్షణ పూర్తయిన సందర్భంగా శుక్రవారం హుస్సేన్ సాగర్ సమీపంలోని బోట్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల విన్యాసాలను శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, పీఅండ్‌ఎల్ ఐజీ రమేశ్ తో కలిసి వీక్షించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో ప్రజల భద్రతకు భరోసా మరింత పెరిగిందన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసుకు చెందిన 10 యూనిట్లు, అగ్నిమాపక శాఖకు చెందిన ఐదు యూనిట్లు కలిపి మొత్తం 15 యూనిట్లకు 1500 వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఇటీవల మహబూబాబాద్, ఖమ్మంలో సంభవించిన వరదల సమయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో నదీపరివాహక ప్రాంతాలు, వరదల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక, గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోందని డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో యూసుఫ్ గూడ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, టీజీఎస్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.