యాసంగిలో వరి వేయొద్దని మేం చెప్పలే

యాసంగిలో వరి వేయొద్దని మేం చెప్పలే
  • ఏడాదికి వడ్ల సేకరణ టార్గెట్స్‌‌ పైనా ఏమీ చెప్పలేదని వెల్లడి
  • వానాకాలం టార్గెట్‌‌ పూర్తి చేయకుండా పరిమితి పెంచమంటే ఎట్ల?: కేంద్రం
  • రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు చాలా స్లోగా జరుగుతున్నయ్
  • యాసంగిలో వరి వేయొద్దన్లే పంట మార్పిడి చేసుకోవాలని మాత్రమే సూచించినం
  • యాసంగిలో వరి వద్దని కేంద్రం అంటోందన్న రాష్ట్ర మంత్రులు

న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోళ్లు, యాసంగి సాగుపై కేంద్రంతో రాష్ట్ర మంత్రులు జరిపిన చర్చలు ఎటూ తేలలేదు. ఏడాది మొత్తానికి వడ్ల కొనుగోళ్ల టార్గెట్‌‌ను ముందుగానే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం అడగ్గా.. కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వలేదని మంత్రి నిరంజన్​ రెడ్డి చెప్పారు. అలాగే యాసంగిలో వరి సాగు చేయొద్దని కేంద్రం చెప్పిందన్నారు. అయితే వానాకాలం పంట కొనుగోళ్ల టార్గెట్‌‌ను పూర్తి చేయకుండానే.. పరిమితి ఎట్లా పెంచాలని రాష్ట్ర మంత్రులను కేంద్రం ప్రశ్నించింది. యాసంగిలో వరి వేయవద్దని తాము చెప్పలేదని, పంట మార్పిడి చేసుకోవాలని మాత్రమే సూచించామంది. ఏడాదికి వడ్ల సేకరణ టార్గెట్ ఒకేసారి చెప్పడం సాధ్యం కాదని, దేశంలోని పంటల పరిస్థితుల ఆధారంగా నిర్ణయం ఉంటుందని తెలిపింది. శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌‌తో మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం భేటీ అయింది. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్, సివిల్ సప్లైయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

టార్గెట్ చెప్పాలని అడిగినం- నిరంజన్ రెడ్డి

కేంద్ర మంత్రితో జరిపిన చర్చల్లో ఎలాంటి క్లారిటీ రాలేదని  నిరంజన్ రెడ్డి చెప్పారు. వడ్ల సేకరణ విషయంలో కేంద్రం రాష్ట్ర రైతులకు పరిష్కారం చూపుతుందని ఆశించామని తెలిపారు. దాదాపు గంట సాగిన సమావేశంలో నిరాశే మిగిలిందన్నారు. యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్‌‌ను కొనబోమని మరోసారి కేంద్ర మంత్రి చెప్పారన్నారు. గత మీటింగ్‌‌లో 40 లక్షల టన్నుల కోటా పెంపు, ఏడాదికి ధాన్యం టార్గెట్స్‌‌పై హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ‘‘వానాకాలం, యాసంగి కలిసి టార్గెట్ ఎంతో చెప్పాలని కేంద్ర మంత్రిని కోరినం. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర రైతాంగాన్ని సిద్ధం చేసుకుంటామని వివరించాం. ఈ సూచన బాగున్నా.. కేంద్ర వ్యవసాయ శాఖ ధాన్యం అంచనా వేసి, ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పారు. త్వరలో కేంద్రం ఒక కమిటీ వేయబోతున్నట్లు తెలిపారు. ఎంఎస్పీ, కొత్త చట్టాలు, దేశంలో పంటల మార్పుపై విధాన పరమైన నిర్ణయం చేసే ఆలోచనతో ఈ కమిటీ పని చేస్తుందట. ఆ కమిటీ నిర్ణయం వచ్చాక దాని ఆధారంగా ఎంఎస్పీ, ఏడాది టార్గెట్స్ నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు” అని నిరంజన్‌‌రెడ్డి తెలిపారు. చర్చలోని అంశాలను కేసీఆర్ కు వివరిస్తామని వెల్లడించారు.

ఎట్ల అడుగుతరు?: కేంద్ర మంత్రి

మార్కెట్‌‌కు వచ్చిన వానాకాలం వడ్లను కొనకుండా, యాసంగి పంటలపై లక్ష్యాలను నిర్దేశించాలని కోరడం ఎంత వరకు సబబని రాష్ట్ర మంత్రుల బృందాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అడిగినట్లు తెలిసింది. తెలంగాణలోని చాలా చోట్ల వడ్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వానాకాలం సీజన్‌‌లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా, ఉన్న పరిమితిని పెంచాలని ఎలా అడుగుతారని ప్రశ్నించినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, అయితే ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశలో ఆలోచన చేయాలని మాత్రమే సూచించామని చెప్పాయి. ఒక ఏడాది టార్గెట్‌‌ను ముందు గానే చెప్పడం సాధ్యం కాదని, దేశంలోని పంటల పరిస్థితుల ఆధారంగా నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ, ఆహార శాఖ సహా అనేక శాఖలు కలిసి దీనిపైన అంచనాలు రూపొందించాల్సి ఉంటుందని కేంద్ర అధికారులు చెప్పారు.