
- అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 38.3 డిగ్రీలు
- అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో 32.9 డిగ్రీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంపరేచర్లు దిగొచ్చాయి. మే పూర్తిగాక ముందే 40 డిగ్రీలకన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీలో అత్యధికంగా 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లాలో 38.1, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో 32.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వనపర్తిలో 33.5, నారాయణపేటలో 34.3, మహబూబ్నగర్లో 34.7, జోగుళాంబ గద్వాల జిల్లాలో 34.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్ నమోదైంది. మిగతా జిల్లాల్లో 35 నుంచి 37 మధ్య రికార్డయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నామూరులో 12.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా తలమడుగులో 8.2 సెంటీ మీటర్లు, పిప్పల్దరిలో 7.9, జగిత్యాలలో 6.3, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 5.8, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 5.8, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.5, ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 5.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది
మరో 5 రోజులూ వానలు
రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ వాయుగుండం మరింత బలపడుతుందని పేర్కొన్నది. ఇటు బంగాళాఖాతంలోనూ 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడి.. బలపడేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఒకట్రెండు రోజుల్లో కేరళలోకి ప్రవేశించే చాన్స్ ఉందని తెలిపింది.