ఇబ్రహీంపట్నంలో దేవుడికి దండం పెట్టి.. విగ్రహాలు ఎత్తుకెళ్లిన దొంగలు

 ఇబ్రహీంపట్నంలో  దేవుడికి దండం పెట్టి..  విగ్రహాలు ఎత్తుకెళ్లిన దొంగలు
  • సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలే టార్గెట్​గా చోరీలు చేస్తున్నారు. ఆదివారం దండు మైలారంలోని అయ్యప్ప గుడిలో దొంగతనం జరగగా, ఈ ఘటన మరవకముందే మరో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలోని పెద్దమ్మ -గంగాదేవి ఆలయంతోపాటు రామాలయంలోకి ప్రవేశించిన దుండగులు దేవుళ్లకు దండం పెట్టి, తాళలను కట్టర్​తో​పగలగొట్టారు. అనంతరం ఈ రెండు ఆలయాల్లో దాదాపు రూ.5 లక్షల విలువైన విగ్రహాలను, హుండీ డబ్బులను ఎత్తుకెళ్లాడు. 

మంగళవారం ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఆలయాలను సీఐ మహేందర్​ రెడ్డి పరిశీలించారు. దొంగ ఆలయంలోకి ప్రవేశించి, సంచితో బయటకు వెళ్తున్న దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు 
యత్నిస్తున్నారు.