
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నినాదాలు చేయగా.. దీంతో, వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది.. రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడుల్లో టీడీపీతో పాటు, వైసీపీ శ్రేణులకు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. అంగళ్ల వద్ద కారు దిగిపోయారు చంద్రబాబు.. వైసీపీ కార్యకర్తలను తరిమికొట్టాలంటూ చంద్రబాబు మైక్‌లో చెప్పారని.. దీంతో, వైసీపీ కేడర్‌ను టీడీపీ శ్రేణులు తరిమినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక, చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటనలోనూ టెన్షన్ వాతావరణం నెలకొన్ని విషయం విదితమే.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ సిద్ధమయింది.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.. పుంగనూరులో ప్రాజెక్టులు రానీయకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పుంగనూరులో చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వబోమంటూ నినాదాలు చేశారు.. కానీ, పుంగనూరులో రోడ్ షో చేసి తీరుతామంటున్నాయి టీడీపీ శ్రేణులు.. 500 మంది పోలీసులతో భారీభధ్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.