చైనా తన ప్రజలపైనే ఆర్మీని ప్రయోగించిన రోజది

V6 Velugu Posted on Jun 05, 2021

కమ్యూనిస్టు దేశమైన చైనాలో నియంతృత్వ పాలనకు ముగింపు చెప్పి.. ప్రజాస్వామ్యం రావాలంటూ 1989లో ఆ దేశ రాజధాని బీజింగ్‌‌లోని తైనన్‌‌మెన్ స్క్వేర్‌‌‌‌ దగ్గర లక్షలాది మంది విద్యార్థులు నిరసనలకు దిగారు. ఆ ఏడాది ఏప్రిల్ 15న రెండు మూడు వేల మందితో మొదలైన ఆందోళనలు.. చైనా ప్రభుత్వ అణచివేతలతో కొద్ది రోజులకే మరింత తీవ్రమయ్యాయి. దీంతో భారీ సంఖ్యలో స్టూడెంట్ నిరాహార దీక్షలకు దిగారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో నిరసనకారులు తైనన్‌‌మెన్‌‌ స్క్వేర్ వద్దకు ‘గాడెస్ ఆఫ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్య దేవత విగ్రహం)’ ఏర్పాటు చేశారు. అక్కడికి లక్షల మంది యువకులు చేరి నిరసనలు చేస్తుండడంతో.. ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని జీర్ణించుకోలేకపోయిన చైనా ప్రభుత్వం మిలటరీని రంగంలోకి దించింది. జూన్‌‌ 4న అత్యంత కర్కశంగా తన ప్రజలపైకే చైనా ఆర్మీ ట్యాంకులతో దాడులకు దిగి.. వందలాది స్టూడెంట్స్‌‌ను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత చైనాలో వాక్ స్వాతంత్ర్యం, మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే హక్కు లాంటివి పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే 1997 వరకు బ్రిటిష్ పాలన కిందనే ఉండి, ఆ తర్వాత నుంచి చైనా చేతుల్లోకి వెళ్లిన హాంకాంగ్‌‌లో మాత్రమే 1989 నాటి దారుణకాండపై నిరసనలు జరుగుతున్నాయి.

హాంకాంగ్‌‌లోని ఈ నిరసనల గురించి చైనా ప్రజలకు తెలియకుండా చేసేందుకు మీడియాపై ఆంక్షలు పెట్టింది. బీజింగ్‌‌లో స్టూడెంట్స్‌‌పై జరిగిన ఆర్మీ దాడిలో మరణించిన వారికి నివాళి తెలుపుతూ, తమ స్వేచ్ఛను హరించొద్దంటూ 1997 నుంచి ఏటా జూన్‌‌ 4న లక్షలాది మంది హాంకాంగ్‌‌లోని విక్టోరియా పార్క్‌‌ వద్ద చేరి క్యాండిల్‌‌ ర్యాలీ చేస్తున్నారు. అయితే కరోనా ఉన్నప్పటికీ నిరుడు కొంత మందితోనైనా ఈ కార్యక్రమం జరిగింది. కానీ గడిచిన 24 ఏండ్లలో తొలిసారి ఈ ఏడాది మాత్రమే జూన్‌‌ 4  ఎటువంటి నిరసనలు లేకుండా ఆ పార్క్ ఏరియా ఖాళీగా కనిపించింది. కరోనా పేరు చెప్పి వారం ముందు నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని పబ్లిక్‌‌ను గుమిగూడనీయకుండా కట్టడి చేయడంలో ఈసారి చైనా సక్సెస్ అయింది. పైన ఉన్న ఫొటోలు 24 ఏండ్లుగా జూన్‌ 4న హాంకాంగ్‌లో జరుగుతున్న నిరసనలవే. కానీ అందులోని చివరి  ఫోటోలో కనిపిస్తున్నది గురువారం విక్టోరియా పార్క్‌ ఖాళీగా ఉన్న దృశ్యం.

Tagged China, army, , Attacked

Latest Videos

Subscribe Now

More News