ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలతో జిల్లాలోని ఏడు మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పంట పొలాలు నీట మునగగా, ఇసుక మేటలు వేసి గడ్డి కన్పించడం లేదు. మన్యంలోని ఏడు మండలాలలతో పాటు ఏపీలోని  విలీన మండలాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఇప్పటికే వరదలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులకు పశువులకు మేత కొనలేని పరిస్థితిలో ఉన్నారు. చేసేదేమి లేక కొందరు తమ పశువులను అమ్మేస్తున్నారు. 

గడ్డి, దాణాకు డిమాండ్​

పల్లెల్లో వరి గడ్డికి డిమాండ్​ పెరిగింది. దాణా కోసం కూడా రైతులు ఎగబడుతున్నారు. దీంతో వీటి రేట్లను పెంచేశారు. గతంలో గడ్డి మోపు రూ.50 నుంచి రూ.70 ఉండేది. వరదలతో గోదావరి పరివాహక ప్రాంతంలో పచ్చి, ఎండుగడ్డి కొరత ఏర్పడటంతో వీటి ధరను అమాంతం పెంచేశారు. ఒక్కో మోపు రూ.150 నుంచి రూ.170 వరకు అమ్ముతున్నారు. 25 కిలోల దాణా రూ.500 ఉంటే ఇప్పుడు రూ.900 పెరిగింది. పశువులను పోషించలేక రైతులు అమ్మేస్తున్నారు. ఛత్తీస్​గఢ్ నుంచి వస్తున్న వ్యాపారులు, రైతులు గిరిజన గ్రామాల్లో పశువులను కొనుక్కొని వెళ్తున్నారు. మరోవైపు హైదరాబాద్​కు చెందిన వ్యాపారులు పశువులను కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. చర్ల కేంద్రంగా ఈ పశువుల తరలింపు నిత్యం జరుగుతోంది. చర్ల, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, వరంగల్​ మీదుగా హైదరాబాద్​కు పశువులను తరలిస్తున్నారు. భద్రాచలం మీదుగా రాత్రి వేళల్లో పశువులు తరలిపోతున్నాయి. 

చాలా కష్టంగా ఉంది

పశువులకు మేత దొరకడం లేదు. చాలా కష్టంగా ఉంది. అడవుల్లోకి తీసుకెళ్దామంటే ఫారెస్ట్​ ఆఫీసర్లు ట్రెంచులు కొట్టిన్రు. గడ్డివాములు వరదల్లో మునిగిపోయినయ్. గడ్డి కొనలేక గొడ్లను అమ్ముకుంటున్నం. 
- కల్లూరి సీతారాములు, బత్తినపల్లి, చర్ల

దాణా పంపిణీ చేస్తున్నాం

వరద ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత ఉంది. ఒక్కో పశువుకు 14 కిలోల దాణాను కలెక్టర్​ ఇస్తున్నారు. ఈ నెల 17 నుంచే పంపిణీ చేస్తున్నాం. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రతీ రైతు కుటుంబానికి అందజేస్తున్నాం.
- డా.రవీందర్, పశు వైద్యాధికారి, మోరంపల్లిబంజర, బూర్గంపాడు

ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ
    
భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరికి ప్రమాదహెచ్చరికలను శనివారం ఉపసంహరించారు. 42.5 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాదహెచ్చరికను కూడా విత్​డ్రా చేశారు. పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉప నదులు, వాగులు శాంతించాయి. దిగువన శబరి, సీలేరు ఉపనదులు తగ్గుముఖం పట్టి, పోలవరం డ్యాం గేట్ల ద్వారా నీటిని ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి సముద్రంలోకి వదిలారు. బ్యాక్​వాటర్​ ఎఫెక్ట్ కూడా పెద్దగా లేకపోవడంతో గోదావరి శాంతించింది. భద్రాచలం నుంచి పేరూరు, ఛత్తీస్​గఢ్, ఒడిశా, ఏపీకి వెళ్లే రహదారులన్నీ బయటపడ్డాయి. అయితే ముంపు మండలాల్లోని భద్రాచలం–-కూనవరం రోడ్డు 40 రోజులుగా నీళ్లలోనే ఉండడంతో పూర్తిగా ధ్వంసమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు నడపడానికి వీల్లేకుండా తయారయ్యాయి. 

కొత్తగూడెం ఏరియాకు మంచి భవిష్యత్తు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఏరియాకు మంచి భవిష్యత్తు ఉందని జీఎం​సీహెచ్ ​నర్సింహరావు తెలిపారు. మూడేండ్లుగా జీఎంగా పని చేస్తూ కొత్తగూడెం కార్పొరేట్​ ప్రాజెక్ట్, ప్లానింగ్​ జీఎంగా బదిలీపై వెళ్తున్న ఆయనను శనివారం అధికారులు, సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా నుంచి వచ్చే ఏడాది 130 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్లాన్ చేశామన్నారు. వీకే–7 ఓసీ డిసెంబర్​లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఫ్రీ వే బిన్​ ద్వారా రూ.వందల కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఇన్​చార్జి ఎస్వోటూజీఎం రమేశ్, టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్​ రజాక్, డీజీఎం పర్సనల్​ పి. శామ్యూల్​ సుధాకర్, సూర్యనారాయణ, యోహాన్, అంజనేయ చెట్టి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పీవీకే–5 ఇంక్లైన్, సెక్యూరిటీ, ఏరియా వర్క్​షాప్​లతో పాటు పలు ప్రాంతాల్లో జీఎంను సన్మానించారు. 

సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీకి వినతి

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి ప్రాంతంలోని సింగరేణి బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్​ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. శనివారం హైదరాబాద్ లో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని వెంగళరావునగర్, జలగంనగర్, విరాట్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, జగన్నాధపురం, కిష్టారం ఎస్సీ, బీ.సీ కాలనీలు, రేజర్ల, కొత్తూరు గ్రామాల్లో మైనింగ్ కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు. అలాగే బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రేజర్ల గ్రామంలో కొందరికి పరిహారం అందలేదని తెలిపారు. సమస్యలపై సీఎండీ సానుకూలంగా స్పందించి త్వరలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సింగరేణి జీఎం సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని బాధితుల సమస్యలపై చర్చించారు. 

ఎమ్మెల్యే, ఎంపీపీల ఆదేశాలతోనే ఆదివాసీలపై దాడులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ భుక్యా సోనా ఆదేశాలతోనే ఉయ్యాలవాడ బాడువ గ్రామంలోని ఆదివాసీలపై దాడులు జరిగాయని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆరోపించారు. పార్టీ ఆఫీస్​లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 16న ఆదివాసీలపై దాడి చేసి ఇండ్లను ధ్వంసం చేయడం వెనుక ఎమ్మెల్యే, ఎంపీపీల హస్తం ఉందని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సర్వే నెంబర్​ 123లో 70 ఎకరాల భూమికి ఆదివాసీలకు పట్టాలు ఉన్నాయన్నారు. 30 ఏండ్లుగా బంజారాలు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కాసాని ఐలయ్య, మెచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ, నాగేశ్వరరావు, కోబల్, వెంకన్న పాల్గొన్నారు. 

ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు

ఖమ్మం టౌన్, వెలుగు: ఏఈవోలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు షేక్ అఫ్జల్ హసన్, ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్​ సాగర్ హెచ్చరించారు. టీఎన్జీవోస్ నేతలను శనివారం ఏఈవోలు కలిసి వినతిపత్రం అందజేసి తమ సమస్యలు వివరించారు. కొన్ని మండలాల్లో ఏవో, ఏడీఏలు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఏఈవోలుగా ఉద్యోగంలో చేరి ఐదేళ్లు గడిచినా కొన్ని డివిజన్లలో సర్వీస్  రెగ్యులైజేషన్  చేయలేదని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్  వీపీ గౌతమ్, వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  ఏఈవో సంఘం నాయకులు అఫ్రీన్, నాగులు మీరా, మహేశ్, సరిత, రవీందర్  తదితరులు పాల్గొన్నారు.

రూ.10 వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారులు 50 పైసలు, ఐదు నిమిషాలు అనే నినాదంతో సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డు పంపించాలని ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా చైర్మన్  డాక్టర్  కేవీ కృష్ణారావు కోరారు. ఖమ్మం సిటీలోని ఉద్యమకారుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్ తో సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంతేటి వీరభద్రం,రాష్ట్ర కో కన్వీనర్ పి కృష్ణ, అన్వర్, ఎస్​డీ బురాన్  పాల్గొన్నారు.