భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు సర్కారు రెడీ

V6 Velugu Posted on Jun 29, 2021

రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలన్న సబ్ కమిటీ
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెరగని రిజిస్ట్రేషన్ విలువ
పెరిగిన రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ పెంచలేదన్న కమిటీ
HMDA పరిధిలో ప్రభుత్వ విలువ కన్నా అధిక విలువతో 51 శాతం  రిజిస్ట్రేషన్లు 
ఏపీలో ఎనిమిదేళ్లలో ఏడు సార్లు పెరిగిన విలువ
ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం
మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ 
విలువల్లో తేడాలతో బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడంలో ఇబ్బందులు 

హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు సర్కారు రెడీ అయ్యింది. వాల్యూ పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్ కమిటీ సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల రేట్లు పెరిగాయని.. వాటికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగలేదని చెప్పింది. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ విలువ మన కంటే ఎక్కువగా ఉందని సబ్ కమిటి అభిప్రాయపడింది.  రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా భూముల విలువ పెంచలేదని.. ఇప్పుడు పెంచే అవకాశాలు పరిశీలించాలని సర్కారుకు  చెప్పింది. ఆర్థికమంత్రి హరీశ్ రావు అధ్యక్షతన హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధికేంద్రంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల విలువలు భారీగా పెరిగాయని సబ్ కమిటీ అభిప్రాయపడింది.

పెరిగిన రేట్ల ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచలేదన్నారు. పెండింగ్ లో ఉన్న భూముల విలువను పెంచాలని సర్కారుకు సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలో 2019-20 సంవత్సరంలో ప్రభుత్వ విలువల కన్నా అధిక విలువతో 51 శాతం  రిజిస్ట్రేషన్లు జరిగాయంది.  పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఏపీలో ఎనిమిదేళ్లలో ఏడు సార్లు విలువలు పెరిగాయంది కమిటీ. ప్రస్తుతం ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ ఉందని చెప్పింది. మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని అభిప్రాయపడింది. ప్రజలపై భారం పడకుండా ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు కమిటీ చెప్పింది.

Tagged Telangana, registration, , value of lands

Latest Videos

Subscribe Now

More News